Earthquake in Nepal claims 128 lives
నేపాల్‌లో భారీ భూకంపం చోటు
చేసుకుంది. దాని ప్రభావంతో 128 మంది ప్రాణాలు కోల్పోయారు, మరో కనీసం 141 మందికి
గాయాలయ్యాయి.
గత అర్ధరాత్రి దాటాక 3గంటల సమయంలో
జాజర్‌కోట్, పశ్చిమ రుకుమ్ ప్రాంతాల్లో 6.4 తీవ్రతతో భూకంపం చోటు చేసుకుంది. ఒక్క
జాజర్‌కోట్‌లోనే 92మంది ప్రాణాలు కోల్పోయినట్లు జాజర్‌కోట్ జిల్లా డీఎస్‌పీ సంతోష్
రోకా వెల్లడించారు. నల్గడ్ మునిసిపాలిటీ డిప్యూటీ మేయర్ సరితా సింగ్ కూడా
చనిపోయినట్లు డీఎస్‌పీ తెలిపారు. జిల్లాలో 55మంది గాయపడినట్లు సమాచారం.
బారేకోట్ రూరల్ మునిసిపాలిటీ
పరిధిలోని రామిదండా ప్రాంతంలో 44మంది చనిపోయారు, మరో 70 మంది గాయపడ్డారు. వారికి
జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.
పశ్చిమ రుకుమ్ జిల్లాలో 36మంది
చనిపోయినట్లు జిల్లా డీఎస్‌పీ నామరాజ్ భట్టరాయ్ వెల్లడించారు. జిల్లాలో 85మంది గాయపడ్డారు.
వారిని జిల్లాలోని ఆస్పత్రులకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న ఒక వ్యక్తిని
ఖాట్మండూ తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆథ్‌బిస్‌కోట్ మునిసిపాలిటీలో 36మంది
చనిపోయారు. శనిభేరీ రూరల్ మునిసిపాలిటీలో 8మంది ప్రాణాలు కోల్పోయారు.
జాజర్‌కోట్ జిల్లాలో భేరీ, నల్‌గఢ్,
కుశే, చేడాగఢ్ ప్రాంతాలు భూకంప ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్నాయి. బాధితులను
వెతకడానికి, వారికి తగిన సహాయం అందించడానికీ భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి.
భేరీ ఆస్పత్రి, కోహల్‌పూర్ మెడికల్
కాలేజ్, నేపాల్‌గంజ్ మిలటరీ హాస్పిటల్, పోలీస్ ఆస్పత్రులను పూర్తిగా భూకంప
బాధితులకు సేవలు అందించడానికే కేటాయించారు. సాధారణ విమాన సర్వీసులన్నీ రద్దు
చేసారు. నేపాల్‌లోని హెలికాప్టర్ ఆపరేటర్స్ అందరినీ ప్రభుత్వానికి అందుబాటులో
ఉండాలని సూచించారు. భూకంప బాధిత ప్రాంతాల నుంచి గాయపడిన వారిని తరలించాలని ఆదేశించారు.
నేపాల్‌గంజ్ విమానాశ్రయం హెలిప్యాడ్ దగ్గర, మిలటరీ బ్యారక్స్ దగ్గర ఆంబులెన్స్‌లను
నిరంతరాయంగా అందుబాటులో ఉంచారు.
నేపాల్ ప్రధానమంత్రి పుష్పకుమార్ దహల్
‘ప్రచండ’ ఈ దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. భద్రతా బలగాల సహాయక
చర్యలు ప్రారంభమయ్యాయన్నారు. భూకంప ప్రభావిత ప్రాంతాల సందర్శనకు ఆయన ఈ ఉదయం బయల్దేరారు.
భూకంప కేంద్రం నేపాల్‌లో భూమ్యుపరితలం
నుంచి 10 కిలోమీటర్ల లోతున ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది.
భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ మీద 6.4గా నమోదయినట్లు నిర్ధారించింది. దీనికి
సంబంధించిన ప్రకంపనలు భారతదేశంలోని ఢిల్లీ-ఎన్‌సీఆర్, ఉత్తరప్రదేశ్, బిహార్
రాష్ట్రాల్లో నమోదైనట్లు ఎన్ఈసీ వెల్లడించింది.