SC dismisses Mosque Committee plea against case transfer
కాశీ విశ్వనాథ ఆలయం-జ్ఞానవాపి మసీదు వివాదంలో
మసీదు కమిటీ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అలహాబాద్ హైకోర్ట్
న్యాయమూర్తి జారీ చేసిన ఆదేశాల్లో జోక్యం చేసుకోడానికి నిరాకరించింది.
ఆలయం-మసీదు వివాదాన్ని సింగిల్ జడ్జ్
బెంచ్ నుంచి మరో బెంచ్‌కు బదిలీ చేస్తూ అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
జస్టిస్ ప్రీతింకర్ దివాకర్ ఆదేశాలు జారీ చేసారు. ఆ ఆదేశాలకు వ్యతిరేకంగా అంజుమన్ ఇంతెజామియా మజీద్ కమిటీ సుప్రీంకోర్టులో
అప్పీలు చేసుకుంది. ఆ అప్పీలును త్రిసభ్య ధర్మాసనం విచారించింది. ప్రధాన
న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పర్దీవాలా, మనోజ్ మిశ్రాలతో
కూడిన త్రిసభ్య ధర్మాసనం ఆ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. బెంచ్ బదిలీ అన్నది వ్యావహారిక
సౌలభ్యం కోసం తీసుకున్న నిర్ణయం మాత్రమేనని సుప్రీంకోర్టు భావించింది.
జ్ఞానవాపి కేసును అలహాబాద్ హైకోర్ట్‌లోని
సింగిల్ జడ్జ్ బెంచ్ 2021 నుంచి విచారిస్తోంది. మసీదులోపల ఉన్న ఆలయాల్లో పూజలకు
అనుమతించాలంటూ కొందరు హిందూభక్తులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వారు వేసిన
కేసులను సవాల్ చేస్తూ మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టులో కేసు వేసింది. ఆ కోర్టులో సింగిల్
జడ్జ్ బెంచ్ ఆ కేసును ఇన్నాళ్ళూ విచారిస్తోంది. పాలనా సౌలభ్యం కోసం ఆ కేసును ఆ
బెంచ్ నుంచి ఉపసంహరిస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు.
కేసు బదిలీ గురించిన కారణాలను
సుప్రీంకోర్టు సీజేఐ బెంచ్ పరిశీలించింది. అయితే వాటిని కోర్టులో అందరిముందూ
చదవాలనుకోవడం లేదని వెల్లడించింది. ‘‘హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉత్తర్వులలో మేం
జోక్యం చేసుకోకూడదు. హైకోర్టులలో ఆ పని (బెంచ్ మార్పిడి) సర్వసాధారణమైన విషయం. అది
హైకోర్టు సీజే పరిధిలోనే ఉంటుంది’’ అని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం
తేల్చిచెప్పింది.
అలహాబాద్ హైకోర్టులో జస్టిస్ ప్రకాష్ పడియా ఈ కేసును పూర్తిగా
విచారించి తీర్పును రిజర్వ్‌లో ఉంచారని, మసీదు కమిటీ తరఫున వాదించిన సీనియర్
అడ్వొకేట్ హుజెఫా అహ్మదీ సుప్రీంకోర్టుకు వెల్లడించారు. అయితే రోస్టర్ మార్పును
కారణంగా చూపి ప్రధాన న్యాయమూర్తి ఆ జడ్జి నుంచి ఆ కేసును ఉపసంహరించారని వివరించారు.
ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించినా, మసీదు కమిటీకి ఫలితం
దక్కలేదు.