Antony Blinken lands in Israel
హమాస్-ఇజ్రాయెల్
యుద్ధం నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకెన్ ఈ ఉదయం ఇజ్రాయెల్
చేరుకున్నారు. అక్టోబర్ 7 హమాస్ దాడి తర్వాత బ్లింకెన్ టెల్ అవీవ్ వెళ్ళడం ఇది
రెండోసారి.
ఇప్పటివరకూ
ఇజ్రాయెల్‌ను పూర్తిగా వెనకేసుకువచ్చిన అమెరికా, గాజాపై ఐడీఎఫ్ దాడుల తీవ్రత
పెరిగాక స్వరం మార్చింది. గాజాలో చిక్కుకుపోయి ఉన్న విదేశీయులు బైటకు
వెళ్ళిపోడానికి వీలుగా ప్రస్తుత దాడులకు విరామం ప్రకటించాల్సిన అవసరం ఉందని
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభిప్రాయపడ్డారు. సుమారు 5వందల మంది అమెరికన్లు గాజా
ప్రాంతంలో ఉన్నారు. వారిని సురక్షితంగా విడిపించుకోడానికి అమెరికా ప్రయత్నిస్తోంది.
ఆ మేరకు ఇజ్రాయెల్‌కు నచ్చజెప్పడానికే అమెరికా మంత్రి ఆ దేశంలో పర్యటిస్తున్నారని
భావిస్తున్నారు.
ఇదిలా
ఉండగా, ఇజ్రాయెల్ మిలటరీ గాజా నగరాన్ని పూర్తిస్థాయిలో చుట్టుముట్టామని
ప్రకటించింది. హమాస్ ఔట్‌పోస్ట్‌లు, కార్యాలయాలు, ఇతర నిర్మాణాలపై దాడులు
మొదలుపెట్టింది. ఈ తరుణంలో కాల్పుల విరమణ ప్రసక్తే లేదని ఐడీఎఫ్ అధికార ప్రతినిధి
డానియెల్ హగరి ప్రకటించారు. ఈ పోరాటంలో ఇప్పటివరకూ తమ సైనికులు 23మంది ప్రాణాలు
కోల్పోయారని వెల్లడించారు.
ఇజ్రాయెల్
హెచ్చరికలకు బెదిరేది లేదంటోంది హమాస్. గాజాను చుట్టుముట్టామన్న ఇజ్రాయెల్
ప్రకటనకు హమాస్ మిలటరీ విభాగం ఎజెద్దీన్ అల్ కసామ్ బ్రిగేడ్స్ స్పందించింది. ఇజ్రాయెల్
సైనికులను చంపి, నల్లటి సంచుల్లో వెనక్కు పంపిస్తామని ప్రకటించింది.
గాజా
ఉత్తర ప్రాంతంలో యుద్ధం తీవ్రమవుతుండడంతో విదేశీయులూ, ద్వంద్వపౌరసత్వం కలిగినవారూ ఆ
ప్రాంతాన్ని ఖాళీ చేస్తున్నారు. రఫా సరిహద్దును తెరవడంతో, ఈజిప్ట్
వెళ్ళిపోతున్నారు. రెండు రోజుల్లో 72మంది పిల్లలు సహా 344 మంది విదేశీయులు, 21మంది
పాలస్తీనా ప్రజలూ తమ దేశంలోకి వచ్చారని ఈజిప్ట్ వెల్లడించింది.
మరోవైపు,
ఇరాన్ మద్దతున్న లెబనాన్ ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లా నాయకుడు హసన్ నస్రల్లా, 19
ఇజ్రాయెల్ స్థావరాలపై దాడులు చేసామని ప్రకటించారు.
లెబనాన్ భూభాగం నుంచి హెజ్బొల్లా దాడులు చేసింది. దాన్ని ఎదుర్కోడానికి ట్యాంకులు,
ఫిరంగులతో పాటు యుద్ధవిమానాలు, హెలికాప్టర్లతోనూ దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్
ప్రకటించింది.