అక్రమాస్తుల కేసులో సీఎం జగన్మోహన్రెడ్డి(cm ys jagan mohan reddy) కి సుప్రీంకోర్టు (supreme court)లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అక్రమాస్తుల కేసుల విచారణలో తీవ్ర జాప్యంపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు (mp raghumakrishnaraju) సుప్రీంకోర్టులో వేసిన పిటీషన్‌పై స్పందించిన ధర్మాసనం సీఎం జగన్‌రెడ్డికి, సీబీఐకి కూడా నోటీసులు జారీ చేసింది. రఘురామరాజు కేసును ఎందుకు విచారించకూడదో చెప్పాలంటూ ఈ కేసులో ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది.
అక్రమాస్తుల కేసులు తెలంగాణ సీబీఐ కోర్టు (cbi court)లో పదేళ్లుగా విచారణ సాగుతున్నాయి. సీబీఐ నమోదు చేసిన 11 కేసులు 3041 సార్లు వాయిదా పడ్డాయి. కేసును త్వరగా పూర్తి చేసి నిందితులను శిక్షించాలని సీబీఐకి కనిపించడం లేదని పిటిషనర్ ఆరోపించారు.ప్రధాన నిందితుడు ఏపీ సీఎం జగన్ ఇష్టానుసారం వాయిదాలు కోరే స్వేచ్ఛను సీబీఐ కల్పించిందని పిటిషన్లో పొందుపరిచారు. దీని వల్ల కేసుల విచారణలో అంతులేని జాప్యం జరుగుతోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇలాగే కొనసాగితే అసలు అక్రమాస్తుల విచారణ ప్రారంభం అయ్యేలా అనిపించట్లేదని, సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకుని సీఎం జగన్మోహన్రెడ్డి కేసులను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని ఎంపీ రఘురామరాజు పిటీషన్లో పేర్కొన్నారు.
ఏపీ సీఎంగా జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక ఇసుక, మద్యంలో జరిగిన అవినీతిపై ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. 1200 పేజీల వివరాలతో ఆయన జగన్ అవినీతిపై పిల్ వేశారు. కేసును స్వీకరించిన హైకోర్టు నెంబరు కేటాయించింది.త్వరలో విచారణకు రానుంది.