Female Student Forcibly kissed at IIT BHU
ఉత్తరప్రదేశ్ వారణాసిలోని ఐఐటీ బీహెచ్‌యూ ఆవరణలో
ఓ విద్యార్ధినిపై లైంగిక దాడి జరిగింది. ముగ్గురు ఆగంతకులు ఆమెను బలవంతంగా ముద్దుపెట్టుకుని,
ఆమె దుస్తులు చించివేసారు. ఆ ఘాతుకాన్ని వీడియోలో రికార్డు కూడా చేసారు.
ఈ ఘటన బుధవారం రాత్రి స్టూడెంట్స్ హాస్టల్ దగ్గర చోటు
చేసుకుంది. ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు మోటర్ బైక్ మీద వచ్చి, ఈ ఘాతుకానికి
పాల్పడ్డారు. విషయం బైటపడడంతో వందలమంది విద్యార్ధులు ఈ ఉదయం ఐఐటీ ఆవరణలో నిరసన
ప్రదర్శన నిర్వహించారు. ఐఐటీని, బీహెచ్‌యూను విడదీస్తూ గోడ కట్టాలని డిమాండ్
చేసారు.
విశ్వవిద్యాలయ అధికారులు విద్యార్థి సంఘాల
ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఆ తర్వాత వర్సిటీ రిజిస్ట్రార్ ఒక ప్రకటన విడుదల
చేసారు. ‘‘విద్యాశాఖ అధికారులు, విశ్వవిద్యాలయ నిర్వాహకులతో సంప్రదించి, యూనివర్సిటీ
ఆవరణను క్లోజ్డ్ క్యాంపస్‌గా చేస్తాం, బైటివాళ్ళు రాకుండా కట్టుదిట్టం చేస్తామ’’నవ
ఆ ప్రకటనలో వెల్లడించారు. యూనివర్సిటీలో భద్రతను కట్టుదిట్టం చేసామని, త్వరలోనే
సీసీటీవీ కెమెరాలు కూడా అమరుస్తామనీ రిజిస్ట్రార్ వివరించారు. విశ్వవిద్యాలయ
ఆవరణలో విద్యార్ధులు రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకూ తిరగకుండా
ఆంక్షలు విధించారు.
బాధిత యువతి ఈ ఘటనపై ఫిర్యాదు చేసింది. ఆమె కథనం
ప్రకారం…. బుధవారం రాత్రి ఒక స్నేహితుడితో కలిసి బైటకు వెళ్ళింది. వారు కర్మన్
బాబా గుడి సమీపంలో ఉండగా ముగ్గురు వ్యక్తులు ఒక మోటర్ సైకిల్ మీద వచ్చారు. వారు
ఆమెను బలవంతంగా ఒక మూలకు లాక్కుపోయారు. అక్కడ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు.
ఆమె దుస్తులు చింపివేసారు. ఆమె ఫొటోలు, వీడియోలు తీసారు. సుమారు 15 నిమిషాలు దాడి
చేసాక ఆమె ఫోన్ నెంబర్ తీసుకున్నారు.
బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు
మేరకు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. విశ్వవిద్యాలయ అధికారులతో కలిసి
క్యాంపస్‌లో భద్రతను కట్టుదిట్టం చేస్తామన్నారు.