అమెరికాలో కత్తిపోట్లకు (crime news ) గురైన తెలంగాణలోని ఖమ్మం జిల్లా వాసి పుచ్చా వరుణ్‌రాజ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో పార్ట్ టైం జాబ్ చేస్తూ వరుణ్ రాజ్, ఎం.ఎస్ చదువుతున్నారు. మంగళవారం జిమ్ నుంచి ఇంటికి వెళుతుండగా ఓ దుండగుడు కత్తితో విచక్షణా రహితంగా దాడిచేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వరుణ్ రాజ్‌ను స్థానిక పోలీసులు ఆసుపత్రిలో చేర్చారు.
మూడు రోజులుగా లూథరన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న వరుణ్‌రాజ్ ఇంకా కోమాలోనే ఉన్నారు. లైఫ్ సపోర్టుపై చికిత్స అందిస్తున్నారు. కత్తిపోట్ల వల్ల తీవ్రమైన నరాల బలహీనత ఏర్పడి పాక్షిక వైకల్యం బారినపడే ప్రమాదముందని డాక్టర్లు చెబుతున్నారు.
ఈ ఘటనపై అమెరికా విదేశాంగ శాఖ స్పందించింది. భారత విద్యార్ధిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించింది. బాధితుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నామంటూ విదేశాంగశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. దాడికి సంబంధించిన కారణాలపై అమెరికా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వరుణ్ రాజ్ తల్లిదండ్రులను అమెరికా తీసుకెళ్లేందుకు, అతనికి చికిత్స కోసం నాట్స్ సహాయం ప్రకటించింది.