తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో మరో అడుగు ముందుకు పడింది. ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి
ఫారం 1 నోటీసును ఎన్నికల అధికారులు జారీ చేయనున్నారు. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అవుతుంది. ఈ నెల పదో తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.
బరిలో దిగే అభ్యర్థులు వారి నేర చరిత్రను స్పష్టంగా వివరించాలని కేంద్ర ఎన్నికల సంఘం కొత్త నిబంధన విధించింది. నేరాల వివరాలు మూడుసార్లు పత్రికల్లో ప్రచురించాలని పేర్కొంది. అభ్యర్థులు జైల్లో ఉంటే అక్కడి అధికారుల ఎదుట ప్రమాణం చేసిన, వారి ధ్రువీకరణతో పత్రాలు పంపాలి.
తెలంగాణలో (Telangana Elections) రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. టికెట్లు దక్కిన వారు ప్రచారంలో దూసుకుపోతున్నారు. గెజిట్ నోటిఫికేషన్ కూడా రావడంతో వారంతా నామినేషన్లు వేసేందుకు సిద్దం కానున్నారు. తెలంగాణలో 3.17 కోట్ల మంది ఓటర్లు 119 మంది ఎమ్మెల్యేలను ఎన్నుకోనున్నారు.