INDI Alliance seat
sharing in UP
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని
(UP LS Elections) మొత్తం 80 స్థానాల్లో 65 సీట్లలో తామే పోటీ చేయాలని సమాజ్‌వాదీ
పార్టీ భావిస్తోంది. మిగతా 15 సీట్లను కాంగ్రెస్ సహా మిగిలిన ఇండీ కూటమిలోని
మిత్రపక్షాలకు వదిలేసినట్టు సమాచారం.
సమాజ్‌వాదీ పార్టీ ప్రతిపాదన కాంగ్రెస్
నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమికి ఇబ్బందికరంగా మారింది. ఉన్నవే 15 స్థానాలు, వాటిలో
రాయబరేలీ, అమేఠీ స్థానాలు తప్పకుండా నెహ్రూ కుటుంబానికి పోతాయి. ఇక మిగిలిన 13 స్థానాలను
మిగతా పార్టీలకు సర్దుబాటు చేయాల్సి వస్తుంది. అంతగా పరిస్థితులు అనుకూలించకపోతే, ఇండీ
కూటమిని కాదని ఎస్పీ సొంతంగానే బీజేపీపై పోరాడుతుందని సమాచారం.
సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీల మధ్య
పొత్తుల విషయంలో పొరపొచ్చాలు తగ్గడం లేదు. ప్రధానమంత్రి అభ్యర్ధి అఖిలేష్ యాదవ్ అని
ఎస్పీ, కాదు రాహుల్ గాంధీయేనని కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు ఇటీవలే గొడవపడ్డారు.
ఆ ఘర్షణ ప్రస్తుతానికి ముగిసినట్లే కనిపించినా, నివురు గప్పిన నిప్పులా కొనసాగుతూనే
ఉందని తెలుస్తోంది.
ఇక మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ
పోటీ చేయాలని భావించినా, కాంగ్రెస్ కేవలం 6 సీట్లు మాత్రమే ఇస్తానని చెప్పడం
ఇరుపార్టీల మధ్యా అంతరాన్ని మరింత పెంచింది. ఆ గొడవ వల్ల కాంగ్రెస్ ఎస్పీ బంధం
తెగిపోతుందని అనుకున్నారు. అయితే, తమ మధ్య గొడవలు లేవనీ, కూటమిలో కలిసే ఉన్నామనీ
అఖిలేష్ చెబుతున్నారు.
అసలు, ఇండీ కూటమిని అఖిలేష్ ఒప్పుకోలేదని
తెలుస్తోంది. పీడీఏ అని కొత్త నినాదం అందుకుంది సమాజ్‌వాది పార్టీ. అంటే
వెనుకబడినవారు, దళితులు, అల్పసంఖ్యాకులు అన్నదే ఆ నినాదం. యూపీలో గత పదేళ్ళలో ఖాతా
తెరవని కాంగీయులు ఇప్పుడెలా గెలుస్తారన్నది ఆసక్తికరం.
మరోవైపు, ఇండీ కూటమిలో లుకలుకలు
పెరుగుతున్నాయి. నితీష్ కుమార్ ఇటీవల పట్నాలో సీపీఐ బహిరంగ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్‌ను
విమర్శించారు. జాతీయ ఎన్నికల కసరత్తు ఆలస్యానికి కాంగ్రెసే కారణమన్నారు. ‘‘మేం
వారితో మాట్లాడుతున్నాం. కానీ కూటమి విషయంలో ఈమధ్య అంత పురోగతి లేదు. కాంగ్రెస్‌కు
ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికల మీదే శ్రద్ధ ఉన్నట్టు అనిపిస్తోంది’’ అన్నారు
నితీష్.
మధ్యప్రదేశ్‌తో పాటు
రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరం రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి.
మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో ఉంది. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ పాలనలోనే
ఉన్నాయి. తెలంగాణలో ఇండీ కూటమిలో లేని బీఆర్ఎస్ అధికారంలో ఉంది. మిజోరంలో స్థానిక
పార్టీ అధికారంలో ఉండగా, వారితో బీజేపీ పొత్తులోనూ, ప్రభుత్వంలోనూ ఉంది.