ఉరి శిక్షల అమలుపై ప్రపంచ దేశాలు ఆలోచనలో పడిన వేళ, ఇరాన్ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. గడచిన ఏడు నెలల్లో ఇరాన్ 419 మందికి మరణశిక్ష అమలు చేసింది. గత ఏడాది కన్నా 30 శాతం ఎక్కువని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. గత నాలుగేళ్లుగా ఇరాన్లో ఉరి శిక్షలు ఏటా 25 శాతం పెరుగుతున్నాయని ఐరాస తాజా నివేదిక తెలిపింది.
ఇరాన్లో మానవహక్కుల పరిస్థితులపై ఐక్యారాజ్య సమితి తాజాగా విడుదల చేసిన నివేదిక ఆందోళన కలిగించేదిగా ఉంది. ఈ ఏడాది తొలి ఏడు మాసాల్లో ఇరాన్ 419 మందిని ఉరితీసిందని ఐరాస ప్రకటించింది. వీరిలో ఏడుగురు హిజాబ్ వ్యతిరేక ఆందోళనకారులు ఉన్నారు. మరణశిక్ష పడిన వారిలో 239 మంది మాదక ద్రవ్యాల నేరాలను ఎదుర్కొన్నారని ఐరాస తెలిపింది. గత ఏడాదితో పోల్చుకుంటే మాదక ద్రవ్యాల కేసులు 98 శాతం పెరిగాయని ఐరాస (United Nations) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఉరిశిక్షలు భారీగా అమలు చేయడంపై ఐరాస తీవ్రంగా తీసుకుంది. అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలకు లోబడి విచారణలు జరగలేదని తెలిపింది. హిజాబ్ వ్యతిరేక ఆందోళనకారుల విచారణలో పారదర్శకత లేదని ఐరాస ఆరోపించింది. హిజాబ్ వ్యతిరేక ఆందోళనల సమయంలో 20 వేల మందిని అక్రమంగా అరెస్ట్ చేసి నిర్భందించినట్లు తెలిపింది. ఇలా అరెస్టైన వారిలో ఎక్కువగా చిన్నారులు ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది.