Mahua Moitra before
Ethics Committee
క్యాష్ ఫర్ క్వెరీ స్కామ్‌లో ఇరుక్కున్న
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా ఇవాళ లోక్‌సభ ఎథిక్స్ కమిటీ ముందు
హాజరయ్యారు. ప్రశ్నలు అడగడానికి డబ్బులు తీసుకున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మహువాను
విచారణ కోసం ఎథిక్స్ కమిటీ పిలిపించింది.
సన్నిహితులతో వ్యక్తిగత సంబంధాలు
దెబ్బతిన్నందువల్లే ఈ కేసులో ఇరుక్కున్నట్టు మహువా మొయిత్రా ఎథిక్స్ కమిటీ ముందు
చెప్పారని సమాచారం. మహువా మొయిత్రా తన స్నేహితుడైన వ్యాపారవేత్త దర్శన్
హీరానందానీకి మేలు చేయడం కోసం, అదానీ గ్రూప్‌కి వ్యతిరేకంగా లోక్‌సభలో ప్రశ్నలు
ప్రశ్నలు అడిగారని ప్రధాన ఆరోపణ. దర్శన్‌కు ఆమె తన పార్లమెంటరీ లాగిన్ ఐడీ
వివరాలను ఇచ్చారనీ, అతను వేరేదేశంలో నుంచి ఆ ప్రశ్నలను పోస్ట్ చేసాడనీ తెలిసింది.
ఆ విషయాలను మహువా మొయిత్రా ఇప్పటికే అంగీకరించారు. ప్రశ్నలు తనవేననీ, వాటిని దర్శన్
కేవలం పోస్ట్ మాత్రమే చేసాడనీ ఆమె వాదిస్తున్నారు.
కేంద్రప్రభుత్వానికి చెందిన మూడు
మంత్రిత్వ శాఖలు ఇచ్చిన నివేదికల ఆధారంగా ఎథిక్స్ ప్యానెల్ మహువా మొయిత్రాను
ప్రశ్నిస్తోంది. ఆమె ఇస్తున్న జవాబులను క్రాస్ ఎగ్జామిన్ చేస్తోంది.
ప్రతిపక్షాలు మహువా మొయిత్రాకు అండగా
నిలిచాయి. మహువా డబ్బులు తీసుకున్నారు అనడానికి ఆధారాలు ఎక్కడున్నాయని అడిగాయి.
ఇప్పుడున్న ఎంపీల్లో ఇతరుల మద్దతు లేకుండా లోక్‌సభ సైట్లో ప్రశ్నలడిగినవారు
ఎవరైనా ఉన్నారా అని విపక్షాలు నిలదీసాయి.
లోక్‌సభ లాగిన్‌ను
విదేశాల నుంచి యాక్సెస్ చేసినంత మాత్రాన దేశభద్రతకు వచ్చిన ముప్పేమీ లేదని, ఆ
లాగిన్ ద్వారా పార్లమెంటులో ప్రశ్నలు మాత్రమే అడగవచ్చనీ విపక్షాలు వాదించాయి.
అధికార బీజేపీ మాత్రం అధికారిక లాగిన్ వివరాలను ఇతరులకు షేర్ చేయడం జాతీయ భద్రతకు
ముప్పు అని మండిపడుతోంది.