నీటి పారుదల రంగంపై విశాఖలో సదస్సు
నిర్వహించడం శుభపరిణామమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(CM JAGAN)
అన్నారు. విశాఖపట్నంలోని
రాడిసన్ బ్లూ హోటల్ లో సెంట్రల్ వాటర్ కమిషన్, ఏపీ జలవనరుల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో
నిర్వహిస్తున్న ఐసీఐడీ కాంగ్రెస్ ప్లీనరీని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్(Gajendra Shekavath) తో కలిసి ప్రారంభించారు.
సాగునీటి రంగం, వ్యవసాయంపై ప్రభుత్వం దృష్టి
సారించిందన్న సీఎం జగన్, ఏపీకి విస్తారమైన తీరప్రాంతం ఉందన్నారు. ప్రతీ నీటిబొట్టును
ఒడిసి పట్టుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపిన ముఖ్యమంత్రి, నీటి సంరక్షణ
ద్వారా కరవును ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు.
ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో నీటి
సంరక్షణకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని కేంద్ర జలశక్తిమంత్రి గజేంద్రసింగ్
షెకావత్ తెలిపారు.
రైతులకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. వాటర్
రీసైక్లింగ్ విధానంతో మురికినీటిని శుద్ది చేస్తున్నట్లు వెల్లడించిన షెకావత్…
తాగు, సాగునీటికి ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు చేపట్టినట్లు
వివరించారు.
2019లో ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో జలశక్తి
అభియాన్ ప్రారంభించినట్లు తెలిపారు. దేశంలో నదుల అనుసంధాన ప్రక్రియ కూడా వేగంగా
జరుగుతోందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా డ్యామ్‌లను
పరిరక్షిస్తున్నామన్నారు.
25వ అంతర్జాతీయ కాంగ్రెస్, 74వ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సంయుక్తంగా
విశాఖలో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు.