Israel slams unethical
and irresponsible interview by ‘The Hindu’
పాలస్తీనా-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో
భారతదేశపు ఆంగ్ల దినపత్రిక ‘ది హిందూ’ పాత్రికేయ వ్యవహారశైలి అనైతికంగానూ,
బాధ్యతారహితంగానూ ఉందని భారత్‌లో ఇజ్రాయెల్ రాయబారి నావొర్ గిలాన్ మండిపడ్డారు.
హిందూ గ్రూప్‌కు చెందిన ఫ్రంట్‌లైన్ పత్రిక, హమాస్‌కు నిధులు సమకూర్చే ఉగ్రవాది
మౌసా అబూ మార్జుక్‌ను ఇంటర్‌వ్యూ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆ మేరకు తమ
అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ‘ది హిందూ’ దినపత్రిక యాజమాన్యానికి సుదీర్ఘమైన లేఖ
రాసారు.
‘‘హమాస్-ఐసిస్‌కు చెందిన ఉగ్రవాది మౌసా
అబూ మార్జుక్‌తో ఫ్రంట్‌లైన్ పత్రిక అక్టోబర్ 27 సంచికలో చేసిన ఇంటర్‌వ్యూ తీవ్ర
నిరాశ కలిగించింది. పాత్రికేయ స్వేచ్ఛ ప్రాధాన్యతపైనా, విభిన్న స్వరాలకు అవకాశం కల్పించడంపైనా మాకు
పూర్తి నమ్మకముంది. అయితే ఈ విషయంలో (పాలస్తీనా-ఇజ్రాయెల్ యుద్ధం) మీరు ఇంటర్‌వ్యూ
చేసిన వ్యక్తి ఎంపికే చాలా చెత్తగా ఉంది. లష్కరే
తయ్యబాకు చెందిన అజ్మల్ కసబ్ ముంబై దాడుల విషయంలో తన హేతుబద్ధతను సమర్ధించుకుంటూ
వివరిస్తే, 26/11 ఘటనకు సంబంధించి అతని ఇంటర్‌వ్యూను ఏ ఒక్కరైనా చట్టబద్ధమైనదిగా
భావించగలరా? 12 సెప్టెంబర్ ట్విన్ టవర్ ఎటాక్స్ గురించి మీరు ఒసామా బిన్ లాడెన్‌ను
ఇంటర్‌వ్యూ చేస్తారా?’’ అని ఇజ్రాయెల్ రాయబారి ది హిందూ ఎడిటర్-ఇన్-చీఫ్ సురేష్
నంబత్‌ను నిలదీసారు. మౌసా అబూ మార్జుక్ కేవలం వివాదాస్పద వ్యక్తి మాత్రమే కాదు.
అతను ఉగ్రవాది. వేలాది ఇజ్రాయెలీల రక్తంతో అతని చేతులు తడిసిపోయాయి’’ అని
మండిపడ్డారు.
అబూ మార్జుక్ హమాస్-ఐసిస్ సంస్థ సభ్యుడు.
ఆ సంస్థను అమెరికా, ఈయూ దేశాలు, ఇంగ్లండ్ సహా ప్రపంచంలోని చాలా దేశాలు ఉగ్రవాద
సంస్థగా గుర్తించాయి. అబూ మార్జుక్ 1988 నుంచీ ఇజ్రాయెల్‌లో వేలాదిమంది అమాయక
పౌరులను ఊచకోత కోసాడు. తన ఉగ్రవాద కార్యకలాపాలకు అమెరికాలో కొంతకాలం జైలుశిక్ష అనుభవించాడు.
అలాంటి వ్యక్తికి వేదికగా నిలవడం, ప్రత్యేకించి అక్టోబర్ 7 నాజీ దాడుల సమయంలో
అవకాశం కల్పించడం అత్యంత బాధాకరమైన విషయం. ఇజ్రాయెల్‌పై చేసిన దాడుల్లో
చిన్నారులు, మహిళలు, హోలోకాస్ట్ బాధితులతో సహా 1400 మందిని హమాస్ చిత్రహింసలు
పెట్టి హతమార్చింది. అలాంటి సందర్భాల్లో జర్నలిజం బాధ్యతాయుతంగా ఉండాలి. హింసను, ఉగ్రవాదాన్నీ
మరింత పెంచేలా ప్రేరేపించే స్వరాలకు తావిచ్చేలా ఉండకూడదు. కానీ హిందూ పత్రిక
సరిగ్గా అదే పని చేసింది.
అబూ మార్జుక్ చరిత్రను, అతని ఉగ్రవాద కార్యకలాపాలను
హిందూ పత్రిక పరిశీలించలేదని ఇజ్రాయెల్ రాయబారి నావోర్ గిలాన్ ఆరోపించారు. హమాస్
అబద్ధాలకు హిందూ పత్రిక ప్రచారం కల్పిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసారు. ‘‘వాస్తవాలను
పరిశీలించకుండా, అనుబంధ ప్రశ్నలు వేయకుండా చేసిన ఆ ఇంటర్‌వ్యూ ఏకపక్షంగా ఉంది. అబూ
మార్జుక్ విచ్చలవిడిగా అబద్ధాలాడుతుంటే వాటిని కనీసం ప్రశ్నించలేదు. 18వందల పదాల
వ్యాసంలో ఒక్క వంద పదాలు తప్ప మిగతా అన్నీ అబద్ధాలే, బురద జల్లుడేనని ఇజ్రాయిల్-హమాస్
గురించి ఏ కొంచెం తెలిసిన వ్యక్తికైనా ఇట్టే అర్ధమైపోతుంది. ఇది హమాస్-ఐసిస్ క్రమం
తప్పకుండా వాడే పాత టెక్నిక్కే. అబద్ధాలు ఆడడం, హత్యలు చేయడం, ఆ హత్యల గురించి
మళ్ళీ అబద్ధాలాడడం. ఇప్పుడు కూడా ఆ టెక్నిక్‌నే వాడారు’’ అని గిలాన్ తన లేఖలో
రాసారు.
‘‘దురదృష్టవశాత్తు, ఈ రోజుల్లో సోషల్
మీడియాలో నకిలీ వార్తలు చూడడం సర్వసాధారణం అయిపోయింది. ఇప్పుడు ప్రధాన స్రవంతి
ప్రసారమాధ్యమాల్లో కూడా ఫేక్‌న్యూస్‌కు చోటు కల్పించడం సమస్యాత్మకంగా పరిణమించింది.
కొన్నాళ్ళ క్రితం వరకూ కూడా వ్యక్తులు చేసే ప్రకటనలకు, వారి ఆచరణకూ వారే
జవాబుదారీగా ఉండేలా చూడడం అనే పనిని జర్నలిస్టులు తమ విధిగా భావించేవారు,
వాస్తవాలను పరిశీలించేవారు, క్రాస్‌చెక్ చేసేవారు. తప్పుడు ప్రకటనలను జాగ్రత్తగా
ఫాలోఅప్ చేసేవారు. ప్రత్యేకించి, తీవ్ర పరిణామాలకు దారితీసే ప్రకటనల విషయంలో మరింత
జాగ్రత్త వహించేవారు. అలా చేయలేకపోవడం ఆ ప్రచురణ సంస్థ విశ్వసనీయతను దెబ్బతీయడం
మాత్రమే కాదు, మరణించిన వారిని అవమానించడం కూడా. అలాంటి బాధితులు తమ
సమాధుల్లోనుంచి ఎలుగెత్తి అరిచి నిజాన్ని చాటలేరు కదా. ఉగ్రవాదులు నిజాల పేరిట
చెప్పే అబద్ధాలను నమ్మే అమాయక పాఠకులు హింసామార్గంలోకి మళ్ళే ప్రమాదముంది. అలాంటి ప్రేరేపణల
వల్లే వేలాది మంది యూదులు ఊచకోతకు గురయ్యారు. అందుకే, ‘కొన్ని మాటలు మనుషులను
చంపేస్తాయి’ అన్న విషయాన్ని తీవ్రంగా పరిగణించాలి’’ అని గిలాన్ చెప్పుకొచ్చారు.
‘‘కేవలం ఇజ్రాయెలీలం మాత్రమే మౌసా అబూ
మార్జుక్‌ను ప్రమాదకరమైన ఉగ్రవాదిగా పేర్కొనడం లేదు. అమెరికా సైతం అతన్ని ఉగ్రవాదిగా
గుర్తించింది. పూర్తిస్థాయి ఉగ్రవాది అయిన అబూ మార్జుక్‌కు ఎలాంటి వ్యాపారాలూ
లేవు. అయినప్పటికీ అతని ఆస్తుల విలువ రెండున్నర బిలియన్ డాలర్లు అంటే వినడానికే
ఆశ్చర్యకరంగా ఉంది కదా. బాధ్యత కలిగిన జర్నలిస్టు ఎవరైనా దాని గురించి
ప్రశ్నించకుండా లేక పరిశోధించకుండా ఉంటాడా? ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదం
చేస్తే అన్ని డబ్బులు ఎందుకు వస్తాయి? అంతేకాదు, అబూ మార్జుక్ హమాస్-ఐసిస్‌కు
నిధులు సమీకరించే వ్యూహకర్త కూడా. ఆ రెండు విషయాలకూ సంబంధం లేదా? అది అడగవలసిన ప్రశ్న
కాదా? అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించే ‘ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్’లో
భారత్ సభ్యదేశం. గతేడాది ఐక్యరాజ్యసమితి భద్రతామండలికి అధ్యక్షత కూడా వహించింది.
అలాంటి హోదా కలిగిన దేశపు దినపత్రిక ఆ ప్రశ్నను టెర్రర్ ఫైనాన్సర్‌ను ఎందుకు
అడగలేదు? అతను సేకరించిన నిధుల్లో పాలస్తీనా అభివృద్ధికి కేటాయించినవి ఎన్ని?
ఇజ్రాయెల్ వినాశనానికి కేటాయించినదెంత? అతని జేబులోకి పోయినదెంత?’’ అని ప్రశ్నించారు
గిలాన్.
‘‘ఒక వివాదానికి
సంబంధించి వేర్వేరు దృక్పథాలను సమర్పించడం ఒక పత్రికకు చాలా ప్రధానమే, ఆ
ప్రాధాన్యతను మేం అర్ధం చేసుకున్నాం. కానీ ఉగ్రవాద చరిత్ర కలిగిన వారు, స్వయంగా
హింసాకాండకు పాల్పడేవారు, రక్తాన్ని ఏరులై పారించేవారితో మాట్లాడేటప్పుడు విచక్షణ
వినియోగించాలి. హమాస్ ఉగ్రవాది మౌసా అబూ మార్జుక్‌తో ఇంటర్‌వ్యూ చేసేటప్పుడు
అలాంటి ప్రమాణాలను పాటించకపోవడం సిగ్గుచేటు. ఈ వ్యవహారంపై ఇజ్రాయెలీ ఉద్దేశాలు ఈ ప్రసంగాల వల్ల బైటపడుతున్నాయి. ‘హిందూ’
యాజమాన్యం ఈ అంశంపై తగిన చర్యలు తీసుకోవాలి, భవిష్యత్తులో చేసే ఇంటర్‌వ్యూల్లో
నిష్పక్షపాతంగా ప్రశ్నలు వేయాలి’’ అని గిలాన్ హిందూ పత్రికకు సలహా ఇచ్చారు. ఆ పత్రిక
సంపాదకుడికి రాసిన లేఖను గిలాన్ సోషల్ మీడియాలో షేర్ చేసారు.