ఢిల్లీ మద్యం కుంభకోణంలో తనకు ఇచ్చిన నోటీసులు వెనక్కు తీసుకోవాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ (cm arvind kejriwal ed) కార్యాలయానికి లేఖ రాశారు. లిక్కర్ కుంభకోణంలో ఇవాళ ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇవాళ విచారణకు వెళ్లకూడదని కేజ్రీవాల్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ ఆదేశాల మేరకు ఈడీ తనపై చట్టవిరుద్దంగా సమన్లు జారీ చేసిందని ఆయన ఆరోపించారు.
బీజేపీ నేతలు కుట్రతో తమ నేతను అరెస్ట్ చేయాలని చూస్తోందని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. మద్యం అమ్మకాల లైసెన్స్ విధానాలను మార్చి కొందరికి లబ్ది చేకూర్చడం ద్వారా అవినీతికి పాల్పడ్డారని ఈడీ ఇప్పటికే కీలక వ్యక్తులను అరెస్టు చేసింది.
ఆప్ నేతలు అవినీతిలో కూరుకుపోయారని దర్యాప్తు సంస్థలు, కోర్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. లిక్కర్ స్కాంలో ఆప్ సీనియర్ సీనియర్ నేత మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టు కూడా బెయిల్ నిరాకరించిందని, ఈడీ అధికారులు రూ.338 కోట్ల అవినీతిని గుర్తించారని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇది రాజకీయ ప్రేరేపిత కక్షపూరిత చర్యలంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన వాదనలో నిజం లేదని కూడా బీజేపీ నేతలు ధ్వజమెత్తారు.