గాజాలో హమాస్ (hamas) ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు ఇజ్రాయెల్ వైమానిక, భూతల దాడులను ముమ్మరం చేసింది. హమాస్ కీలక ఉగ్రవాది లక్ష్యంగా మంగళవారంనాడు జరిపిన దాడిలో ఏడుగురు బందీలు కూడా చనిపోయారు. వీరిలో ముగ్గురు విదేశీయులున్నారని హమాస్ ప్రకటించింది. గాజాలోని ఓ పెద్ద పునరావాస కేంద్రం సమీపంలో ఇజ్రాయెల్ జరిపిన బాంబు దాడిలో బందీలు చనిపోయారని తెలుస్తోంది.
జబాలియా పునరావాస శిబిరం వద్ద డజన్ల కొద్దీ శవాలు పడి ఉన్నాయని స్థానిక మీడియా ద్వారా తెలుస్తోంది. హమాస్ మిలటరీ కమాండర్ లక్ష్యంగా టన్నెల్ కాంప్లెక్స్ వద్ద ఇజ్రాయెల్ బాంబు దాడులు చేసింది. ఆ దాడిలో పదుల సంఖ్యలో పౌరులు కూడా చనిపోయినట్లు సమాచారం అందుతోంది.
చనిపోయిన వారి వివరాలను ప్రకటించేందుకు ఇజ్రాయెల్ సైన్యం నిరాకరించింది. వారిని ఇంకా గుర్తించాల్సి ఉందని ఐడీఎఫ్ తెలిపింది. హమాస్ ఉగ్రవాదుల వద్ద ఇంకా 240 మంది బందీలున్నారని ఇజ్రాయెల్ చెబుతోంది. అక్టోబరు 6న ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదుల మెరుపుదాడుల తరవాత జరిగిన యుద్ధంలో ఇప్పటి వరకు 8500 మంది ప్రాణాలు కోల్పోయారు.