జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో వసూలయ్యాయి. ముగిసిన అక్టోబర్ మాసానికి రూ.1.72 లక్షల కోట్లు వసూలయ్యాయి. జీఎస్టీ (gst) అమల్లోకి వచ్చాక ఈ స్థాయిలో వసూలు కావడం ఇది రెండో సారి కావడం గమనార్హం. గత ఏప్రిల్ మాసంలో రూ.1.87 లక్షల కోట్లు అత్యధికంగా వసూలు అయ్యాయి. జీఎస్టీ మొదలయ్యాక అక్టోబరులో రెండో అత్యధిక వసూళ్లుగా రికార్డు నమోదైంది.
అక్టోబర్ నెల వసూళ్లలో సీజీఎస్టీ రూ.30,062 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.38,171 కోట్లు వసూలయినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. ఐజీఎస్టీ ద్వారా రూ.91,315 కోట్లు, సెస్సుల ద్వారా రూ.12,456 కోట్లు సమకూరాయి. వసూలైన మొత్తం జీఎస్టీలో కేంద్రానికి రూ.72,934 కోట్లు, రాష్ట్రాలకు రూ.74,785 కోట్లు వచ్చాయి. అక్టోబరులో ఏపీ నుంచి రూ.8125 కోట్ల జీఎస్టీ వసూలు కాగా, తెలంగాణ నుంచి రూ.23,478 కోట్లు వసూలైంది.