తైవాన్‌పై చైనా సైనిక, దౌత్యపరమైన ఒత్తిళ్లను పెంచుతోంది. తైవాన్ (Taiwan) తమ సొంత భూభాగమని, ఏదొక రోజు స్వాధీనం చేసుకుంటామని చైనా ప్రకటించిన సంగతి తెలిసిందే.మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 24 గంటల్లోనే తమ దేశం చుట్టూ 43 యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టాయని తైవాన్ జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. తైవాన్, చైనా జలసంధిలో 7 యుద్ధ నౌకలు గుర్తించామని ప్రకటించారు.
ఈ సంవత్సరం తమ దేశం చుట్టూ ఎక్కువ సంఖ్యలో యుద్ద విమానాలను తిప్పడం ద్వారా చైనా సైనిక బెదిరింపులకు పాల్పడుతోందని తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. చైనా గత ఏడాది తైవాన్ చుట్టూ యుద్ధ విన్యాసాలు నిర్వహించిందని గుర్తుచేసింది. గత నెలలో తైవాన్ చుట్టూ 103 యుద్ధ విమానాలు నడిపారని తైవాన్ ప్రకటించింది. చైనా కవ్వింపు చర్యలు ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెంచడానికి దారితీస్తాయని తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ఇటీవల తైవాన్ అధ్యక్షుడు త్సాయ్ ఇంగ్ వెన్, కాలిఫోర్నియాలో అమెరికా సెనెట్ స్పీకర్ కెవిన్ మెక్ కార్తీని కలిసిన తర్వాత కూడా చైనా ప్రభుత్వం తైవాన్ చుట్టూ యుద్ధ విన్యాసాలు చేసింది. తమ దేశం చైనాకు చెందిందని అంగీకరించకపోవడంతో, చైనా ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని తైవాన్ ఆరోపిస్తోంది.