Israel attacks refugee
camp in Gaza
గాజా స్ట్రిప్‌లోని జబాలియాశరణార్థి
శిబిరంపై ఇజ్రాయెల్ దళాలు మంగళవారం నాడు వైమానిక దాడి చేసాయి. ఆ దాడిలో కనీసం
50మంది చనిపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు. మృతుల్లో హమాస్ కమాండర్ ఒకరున్నారని
ఇజ్రాయెల్ ప్రకటించింది. ఆ ప్రాంతంలోని హమాస్
ఉగ్రవాదుల భూగర్భ స్థావరాలు కూడా ధ్వంసమయ్యాయని వెల్లడించింది.
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తమ ప్రకటనలో,
గాజాలోని అతిపెద్ద శరణార్థి శిబిరమైన జబాలియాపై చేసిన దాడిలో హమాస్ కమాండర్
ఇబ్రహీం బియారీని హతమార్చినట్లు పేర్కొంది. ప్రస్తుత సంక్షోభ పరిస్థితికి కారణమైన
అక్టోబర్ 7నాటి దాడికి వ్యూహాన్ని రచించి, అమలు చేసినది అతనేనని వెల్లడించింది.
అండర్‌గ్రౌండ్ టన్నెల్ కాంప్లెక్స్‌లో ఇబ్రహీంతో పాటు పలువురు హమాస్ ఉగ్రవాదులు
హతమయ్యారని ఐడీఎఫ్ ప్రకటించింది.
నిజానికి ఈ ఘటనలో మృతుల సంఖ్యపై అస్పష్టత
ఉంది. గాజాలోని హమాస్ ప్రభుత్వ వైద్యశాఖ తన ప్రకటనలో ఇజ్రాయెల్ దాడిలో కనీసం 50మంది
మరణించి ఉంటారని పేర్కొంది. పాలస్తీనా రెడ్ క్రిసెంట్ సొసైటీ, 25మంది మాత్రమే
చనిపోయారంటోంది. గాజాలోని ఒక వైద్యుడు మాత్రం కేవలం తన ఆస్పత్రికే 120 మృతదేహాలు
వచ్చాయని చెప్పాడు. హమాస్ తమ ప్రకటనలో మృతులు, గాయపడినవారి మొత్తం సంఖ్య 400గా
పేర్కొంది.
ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్ యుద్ధట్యాంకులు
గాజా నగరం వైపు ప్రయాణిస్తున్నాయి. గాజా స్ట్రిప్‌లో హమాస్ ఉగ్రవాదులు భూగర్భంలో
సుదీర్ఘమైన సొరంగాలు నిర్మించారనీ, వాటిలో ఆశ్రయం పొందుతున్నారనీ ఇజ్రాయెల్ సైన్యం
చెబుతోంది. ఆ సొరంగాలను ధ్వంసం చేస్తే తప్ప హమాస్ ఉగ్రవాదులను తుడిచిపెట్టడం
సాధ్యం కాదన్నది ఇజ్రాయెల్ వాదన.
మంగళవారం ఒక్కరోజులో భూతల, గగనతల దాడుల
ద్వారా గాజా స్ట్రిప్‌లో సుమారు 3వందల లక్ష్యాలపై దాడులు చేసినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది.
గాజా స్ట్రిప్‌లోని అన్ని ప్రాంతాలలోనూ దాడులు చేస్తున్నామనీ, సాధారణ పౌరుల
ప్రాణాలకు ప్రమాదం జరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామనీ ఐడీఎఫ్ చెబుతోంది.
గాజాలోని హమాస్ ప్రభుత్వ
వైద్యఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం 7 అక్టోబర్‌న హమాస్ దాడుల తర్వాత ఇజ్రాయెల్
చేపట్టిన ప్రతిదాడుల్లో 8500 మందికి పైగా చనిపోయారు. అయితే, హమాస్ ప్రకటనను
నమ్మడానికి అవకాశం లేకుండా ఉంది. ప్లాస్టిక్ బొమ్మలను పొత్తిళ్ళలో చుట్టి ఇజ్రాయెల్
దాడుల్లో చనిపోయిన చిన్నపిల్లలుగానూ, బతికున్నవారిని తెల్లటి దుస్తుల్లో చుట్టి ఇజ్రాయెల్ దాడుల మృతులుగానూ చూపించిన వీడియోలు
బైటపడడంతో… హమాస్ చెబుతున్న గణాంకాలు విశ్వసనీయంగా లేవు.