క్యాష్ ఫర్ క్వైరీ (cash for quary) వివాదంపై తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎథిక్స్ కమిటీకి నేరపూరిత ఆరోపణలను విచారించే
అధికారం లేదని మహువా స్పష్టం చేశారు. పార్లమెంట్ కమిటీలు అధికార దుర్వినియోగం చేయకుండా రాజ్యాంగ నిర్మాతలు కొన్ని రక్షణ ఏర్పాట్లు చేశారని ఎంపీ మహువా మొయిత్రా లోక్‌సభ ఎథిక్స్ కమిటీ ఛైర్మన్ వినోద్ కుమార్ సోంకర్‌కు లేఖ రాశారు. ప్రశ్నకు నోటు వ్యవహారంలో వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీని కూడా విచారణ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. తనపై వచ్చిన ఆరోపణలను విచారించడానికి లోక్‌సభ ఎథిక్స్ కమిటీ సరైన వేదిక కాకపోవచ్చని మహువా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ వద్ద నుంచి పెద్ద మొత్తంలో నగదు, బహుమతులు తీసుకుని అదానీ కంపెనీపై పార్లమెంటరీ ఐడీ ద్వారా అనేక ప్రశ్నలు వేసిందని మహువాపై ఆరోపణలు వచ్చాయి. ఆమె పార్లమెంటరీ ఐడీని దుర్వినియోగం చేసినట్లు రుజువైతే సస్పెన్షన్ తప్పదని తెలుస్తోంది.
ఎథిక్స్ కమిటీ నాకన్నా ముందే మీడియాకు సమన్లు విడుదల చేసింది కావున, కమిటీ ముందు హాజరయ్యే ఒక రోజు ముందే నేను కూడా నా లేఖను విడుదల చేయడం ముఖ్యమని భావిస్తున్నానంటూ మహువా వ్యాఖ్యానించారు. మహువా పార్లమెంటరీ ఐడీని వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీకి అప్పగించిందంటూ బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే ఆరోపణలతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.