స్కిల్ డెవలప్మెంట్(skill case) కేసులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో, మంగళవారం సాయంత్రం ఆయన రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు. కస్టడీలో ఉన్నప్పుడు తనకు సంఘీభావం తెలిపిన వారందరికీ చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు విడుదల విషయం తెలియడంతో రాజమండ్రి జైలు వద్దకు భారీగా జనం చేరుకున్నారు. అక్కడ గందరగోళం నెలకొనడంతో పోలీసులు లాఠీఛార్జి చేశారు. పోలీసుల తీరుపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు మీడియాతో కాసేపు మాట్లాడారు. తనను అన్యాయంగా జైల్లో పెట్టారని, స్కిల్ డెవలప్మెంట్ పథకంలో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని చెప్పారు. రాజమండ్రి జైలు నుంచి రావులపాలెం, తాడేపల్లిగూడెం, దెందులూరు, హనుమాన్ జంక్షన్, ఏలూరు, గన్నవరం, విజయవాడ మీదుగా ఇవాళ రాత్రికి ఉండవల్లిలోని ఇంటికి చేరుకుంటారు. గురువారం ఉదయం చంద్రబాబు తిరుమలేశుని దర్శనానికి వెళతారని టీడీపీ వర్గాలు తెలిపాయి. చంద్రబాబు విడుదల సమయానికి ఆయన భార్య భువనేశ్వరి విజయనగరంలో నిజం గెలవాలి కార్యక్రమంలో ఉన్నారు. 53 రోజులుగా తమకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.
చంద్రబాబు జైలు నుంచి విడుదల కాగానే మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయం వద్ద అభిమానులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. మధ్యంతర బెయిల్ రాగానే పలు జిల్లాల్లో టీడీపీ అభిమానులు, నాయకులు బాణాసంచా పేల్చి స్వీట్లు పంచారు.