Manipur police officer shot dead
మణిపూర్‌లో
ఒక పోలీస్ అధికారి తీవ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. మణిపూర్-మయన్మార్
సరిహద్దులోని వాణిజ్య నగరం మోరేలో ఒక హెలిప్యాడ్ నిర్మాణ పనుల వద్ద భద్రతా
ఏర్పాట్లు చూస్తున్న పోలీస్ అధికారి చింగ్తామ్ ఆనంద్‌ను తీవ్రవాదులు
కాల్చిచంపినట్లు రాష్ట్రప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆ హత్య నేపథ్యంలో
రాష్ట్ర క్యాబినెట్ అత్యవసరంగా సమావేశమైంది.
కుకీ-మెయితీ
జాతుల మధ్య ఘర్షణ తర్వాత ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి చేరుకుంటున్న మణిపూర్‌లో
భద్రతాదళాలపై తీవ్రవాదుల దాడులు పెరుగుతున్నాయి. హెలిప్యాడ్ ప్రాజెక్టు వద్ద
జరిగిన ఈ హత్యే దానికి నిదర్శనం. సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ చింగ్తామ్ ఆనంద్‌ను
హుటాహుటిన ఆస్పత్రికి తీసుకువెళ్ళారు. ఆయన అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు
కోల్పోయారని స్థానిక పోలీసులు వెల్లడించారు.
బులెట్
గాయాన్ని పరిశీలిస్తే అది లార్జ్ క్యాలిబర్ మార్క్స్ మ్యాన్ లేదా స్నైపర్ రైఫిల్‌తో
దూరం నుంచి కచ్చితంగా గురి చూసి కాల్చినట్లు అర్ధమవుతోందని పోలీసులు చెప్పారు.
హెలిప్యాడ్ ప్రాంతానికి కొంచెం దూరంలో ఉన్న పౌరనివాసాల ప్రాంతం నుంచి కాల్పులు
జరిపారనీ, అందువల్లనే వెంటనే ప్రతిదాడి చేయలేకపోయామనీ పోలీసులు వివరించారు. ఆ
వెంటనే దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
మోరేలో
హెలిప్యాడ్‌ను సరిహద్దు భద్రతా దళం, రాష్ట్ర పోలీసు బలగం సంయుక్తంగా
నిర్మిస్తున్నాయి. రాష్ట్ర రాజధాని ఇంఫాల్ నుంచి భద్రతా బలగాలు రహదారి మార్గంలో
మోరే వెళ్ళేటప్పుడు దుండగులు పలుచోట్ల అవాంతరాలు కలిగిస్తున్నారు, దాడులు
చేస్తున్నారు. అలాంటి సంఘటనలను నివారించేందుకు భద్రతా బలగాలు వాయుమార్గంలో మోరే
చేరుకోడానికి వీలుగా హెలిప్యాడ్ నిర్మిస్తున్నారు.
పోలీస్
అధికారి దారుణ హత్య తనను ఎంతో కలచివేసిందని, ఈ హత్యకు కారకులైన వారిని పట్టుకుని
కఠినంగా శిక్షిస్తామనీ మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ ఎక్స్-పోస్ట్‌లో
ట్వీట్ చేసారు. అత్యవసర క్యాబినెట్ సమావేశం తర్వాత మణిపూర్ ప్రభుత్వం ఒక ప్రకటన
విడుదల చేసింది. ఈ పిరికిపంద చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ ప్రకటనలో
వెల్లడించింది. మరణించిన అధికారి కుటుంబానికి 50లక్షల పరిహారం, ఆయన
కుటుంబసభ్యుల్లో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించింది.
పోలీస్
అధికారి హత్యకు బాధ్యులుగా భావిస్తున్న ‘కుకీ-జో ఇంటలెక్చ్యువల్ కౌన్సిల్’ సంస్థ
మీద ఎఫ్ఐఆర్ దాఖలు చేసిట్లు ప్రభుత్వం వెల్లడించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల
నియంత్రణా చట్టం (ఉపా) సెక్షన్ 3 మేరకు ఆ కౌన్సిల్‌ను చట్టవిరుద్ధమైన సంస్థగా
ప్రభుత్వం ప్రకటించింది.
కుకీ-జో
కౌన్సిల్ అక్టోబర్ 24న ఒక ప్రకటన విడుదల చేసింది. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలతో
కుకీ నేషనల్ ఆర్మీ సహా సుమారు 25 తీవ్రవాద దళాలు ఒప్పందం కుదుర్చుకున్నందున అవి
భారత ప్రభుత్వంపై యుద్ధం చేయలేవనీ, అందువల్ల కుకీ జో తెగకు చెందిన కార్యకర్తలు
ప్రభుత్వంపై సాయుధపోరాటానికి ముందుకు రావాలనీ ఆ ప్రకటన ద్వారా పిలుపునిచ్చింది.