విపక్ష ఎంపీల ఫోన్లకు మంగళవారంనాడు హ్యాకింగ్ అలర్ట్ రావడం కలకలం రేపింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని హ్యాకర్లు మీ ఫోన్ హ్యాక్ చేస్తున్నారంటూ మెసేజ్ రావడంతో ప్రతిపక్ష ఎంపీలు కలవరపడ్డారు. దీనిపై యాపిల్ సంస్థ స్పంధించింది. కొన్ని నకిలీ అలర్ట్లు కూడా వస్తుంటాయని అధికారిక ప్రకటన విడుదల చేసింది.
విపక్ష ఎంపీలకు వచ్చిన ఫోన్ హ్యాకింగ్ అలర్ట్లు అధికారిక హ్యాకర్లు చేశారని చెప్పలేం. హ్యాకర్లు అధునాతన పద్దతులు పాటిస్తారు. వారికి నిధులు, టెక్నాలజీ అందుబాటులో ఉంటుంది. హ్యాకింగ్ విధానాలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. హ్యాకర్ల దాడులను గుర్తించడం నిఘా సంకేతాలపై ఆధారపడి ఉంటుందని యాపిల్ తెలిపింది. హ్యాకర్ల దాడుల్లో కొన్నింటిని గుర్తించలేమని కూడా యాపిల్ ప్రకటించింది.
విపక్ష ఎంపీలకు హ్యాకింగ్ అలర్ట్ ఎందుకు వచ్చిందనేని మాత్రం యాపిల్ సంస్థ స్పష్టత ఇవ్వలేదు. ఈ విషయాన్ని మేం చెప్పలేం. అది బయట పెడితే హ్యాకర్లు నిఘా నుంచి తప్పించుకునే ప్రమాదముందని యాపిల్ (apple) సంస్థ ప్రకటించింది.
కాంగ్రెస్ నేతలు శశిథరూర్, పవన్ ఖేడా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా సహా, మరికొందరు విపక్ష ఎంపీలకు అలర్ట్ మెసేజ్లు వచ్చాయి. కేంద్రం తమ ఫోన్లను హ్యాక్ చేస్తోందని విపక్ష ఎంపీలు సోషల్ మీడియాలో స్క్రీన్ షాట్లను షేర్ చేయడంతో కలకలం మొదలైంది. 150 దేశాల్లోని ఐఫోన్ (iPhone) యూజర్లకు అలర్ట్ మెసేజ్లు వచ్చినట్లు యాపిల్ ప్రకటించింది.