దేశ చరిత్రలో అతిపెద్ద డేటా లీక్ కలకలం రేపుతోంది. దేశంలోని 81.5 కోట్ల మంది వివరాలు డార్క్‌వెబ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఇంత స్థాయిలో ఎప్పుడూ డేటా లీక్ కాలేదని నిపుణులు చెబుతున్నారు. కరోనా సమయంలో ఐసీఎంఆర్ ప్రజల నుంచి సేకరించిన డేటాను దొంగిలించి డార్క్‌వెబ్‌లో పెట్టారనే అనుమానాలు వస్తున్నాయి. దీనిపై సీబీఐ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
ఓ హ్యాకర్ ఈ డేటాను లీక్ (data leak) చేశాడని అనుమానిస్తున్నారు. ఈ డేటాలో ఆధార్ వివరాలు, పాస్‌పోర్టు సమాచారం, పేర్లు, ఫోన్ నంబర్లు, చిరునామాలున్నాయి. ఐసీఎంఆర్ కోవిడ్ సమయంలో సేకరించిన సమాచారమని హ్యాకర్ చెబుతున్నాడు.
ఈ నెల 9న డేటా లీక్ వ్యవహారం వెలుగు చూసింది. అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ ముందుగా గుర్తించింది. ఓ హ్యాకర్ వద్ద భారతీయులకు చెందిన 81.5 కోట్ల మంది డేటా ఉందని ప్రకటించింది. వీటికి సంబంధించిన లక్ష ఫైల్స్ హ్యాకర్ వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. ఆ డేటాను ఆధార్ కార్డులతో పరిశీలించగా లీక్ నిజమేనని తేలింది.
డేటా లీక్‌పై ది కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా, ఐసీఎంఆర్‌ను అప్రమత్తం చేసింది. కోవిడ్ సమయంలో ప్రజల నుంచి సేకరించిన సమాచారం ఐసీఎంఆర్‌తోపాటు, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ వద్ద ఉంది. అయితే ఎక్కడి నుంచి లీకైంది అనేది స్పష్టంగా తెలియరాలేదు.