ఇసుక అమ్మకాల్లో వైసీపీ ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడిందని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందరేశ్వరి ఆరోపించారు. ఇసుక తవ్వకాలన్నీ ఒకే కంపెనీకి కట్టబెట్టి వారి నుంచి వేల కోట్లు ముడుపులు తీసుకుంటున్నారని వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాల ఫోటోలను విజయవాడ బీజేపీ కార్యాలయంలో ఆమె ప్రదర్శించారు.
గత ప్రభుత్వం ఉచితంగా ఇసుక సరఫరా చేసిందని, వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇసుక తవ్వకాలన్నీ ఢిల్లీకి చెందిన ఒకే కంపెనీకి కట్టబెట్టారని పురందరేశ్వరి విమర్శించారు.ఇసుక ధరలు విపరీతంగా పెంచి కూలీల పొట్టగొట్టారని ఆమె దుయ్యబట్టారు. ఇసుక తవ్వకాల్లో నిబంధనలకు పాతరేసిన విషయాన్ని ఫొటోలు ద్వారా మీడియాకు ఆధారాలు చూపిస్తూ, వైసీపి ప్రభుత్వం వ్యవహారం పై తీవ్రస్ధాయిలో మండి పడ్డారు. ఒకప్పుడు ట్రాక్టర్ ఇసుక వెయ్యి రూపాయలు పలికేది అందులో ఎక్కువ భాగం ట్రాక్టర్ ఎగుమతి, దిగుమతి ఛార్జీలు ఉండేవి. ప్రస్తుత ప్రభుత్వంలో ట్రాక్టర్ ఇసుక అయిదు నుండి ఆరువేల రూపాయలు ధర పలుకుతోందని ఆమె వివరించారు.
ఇసుక ధరలు అనూహ్యంగా పెరగడంతో 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డునపడ్డారని పురందరేశ్వరి తీవ్ర విమర్శలు చేశారు. ఇసుక తవ్వకాలు, అమ్మకాలు ఒక్కరికే కట్టబెట్టి, కేవలం రూ. 760 కోట్లు మాత్రమే ఆదాయం చూపారని, వేల కోట్లు చేతులు మారాయని ఆమె గణాంకాలతో వివరించారు.