స్కిల్ స్కాంలో మాజీ సీఎం చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ లభించింది. అనారోగ్య కారణాల రీత్యా బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు (ap highcourt) తీర్పు వెలువరించింది. మధ్యంతర బెయిల్ పిటీషన్‌పై సోమవారం వాదనలు విన్న న్యాయమూర్తి, తీర్పును ఇవాళ వెలువరించారు. నాలుగు వారాలపాటు అంటే నవంబరు 28 వరకు బెయిల్ ఇచ్చారు. మధ్యంతర బెయిల్‌కు న్యాయమూర్తి 5 కండీషన్లు విధించారు.
పిటిషనర్ చంద్రబాబు రూ.1 లక్ష పూచీకత్తు, ఇద్దరు ష్యూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. చంద్రబాబు ఏ ఆసుపత్రిలోనైనా చికిత్స తీసుకోవచ్చు, ఖర్చులన్నీ ఆయనే భరించుకోవాలని కోర్టు సూచించింది. తీసుకున్న చికిత్స వివరాలను కోర్టుకు తెలియజేయాలని ఆదేశించారు. ఎక్కడ చికిత్స తీసుకున్నారో రాజమండ్రి జైలు సూపరింటెండెంట్‌కు సీల్డ్ కవర్లో సమాచారం అదించాలని షరతులు విధించారు. సీల్డ్ కవర్ జైలు అధికారి ట్రయల్‌కు పంపాలని కోర్టు స్పష్టం చేసింది.
పిటిషనర్ స్కిల్ స్కాం కేసు (skill scam case)తో సంబంధం ఉన్న ఏ వ్యక్తినీ ప్రలోభ పెట్టరాదు, బెదిరించకూడదు, ఎలాంటి హామీలు ఇవ్వకూడదు.కోర్టుకు సంబంధించిన వివరాలు చెప్పాలని కోరకూడదు. నవంబర్ 28న సాయంత్రం 5 గంటలకల్లా సరెండర్ కావాలని షరతు విధించారు.