Israel denies to call for ceasefire
హమాస్ ఉగ్రవాద సంస్థపై చేస్తున్న
యుద్ధాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి
బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. ఇజ్రాయెల్ సైనిక దళాలు గాజా స్ట్రిప్‌లోని హమాస్
ఉగ్రవాదులపై భూతల, గగనతల దాడులు కొనసాగిస్తున్నారు.
అక్టోబర్ 7న పాలస్తీనా గాజాస్ట్రిప్
భూభాగం నుంచి ఇజ్రాయెల్ మీద దాడులు చేయడంతో మొదలైన ఘర్షణలు తీవ్రరూపం దాల్చి
యుద్ధంగా పరిణమించాయి. హమాస్ ఉగ్రవాదులు సుమారు 230మంది ఇజ్రాయెలీలను నిర్బంధించారు.
వారిని అడ్డం పెట్టుకుని తమపై దాడులు ఆపాలంటూ ఇజ్రాయెల్‌ను డిమాండ్ చేస్తున్నారు.
కాల్పుల విరమణకు ఒప్పుకోవడమంటే హమాస్‌కు,
ఉగ్రవాదానికీ లొంగిపోవడమేనని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అన్నారు. అటువంటి
పని తాము ఎప్పటికీ చేయబోమని కుండ బద్దలుగొట్టి చెప్పారు. ఇజ్రాయెల్ మిత్రపక్షమైన
అమెరికా కూడా కాల్పుల విరమణకు సుముఖంగా లేదు.
అక్టోబర్ 7న తాము బంధించినవారిలో
ముగ్గురు ఇజ్రాయెలీ మహిళల వీడియో రికార్డ్ చేసి హమాస్ సంస్థ నిన్న విడుల చేసింది.
తద్వారా పాలస్తీనాను బెదిరించే ప్రయత్నం చేసింది. దాన్ని ‘క్రూరమైన మానసిక ప్రచారం’గా
అభివర్ణించారు బెంజమిన్ నెతన్యాహు. హమాస్
దగ్గర బందీలుగా ఉన్న తమవారిని విడిపించుకుని తీరతామన్నారు.
గాజాస్ట్రిప్‌లో భూతల దాడులు చేస్తున్న
ఇజ్రాయల్ సైన్యం, హమాస్ బంధించిన తమ సైనికురాలు ఒకరిని విడిపించుకోగలిగింది.
అక్టోబర్ 7న హమాస్ కిడ్నాప్ చేసిన సైనికురాలు ఒరి మెగిదిష్‌ను విడిపించుకున్నామని
ఇజ్రాయెల్ సైన్యం ఒక ప్రకటనలో వెల్లడించింది.
అంతకుముందు హమాస్ తాము చెర పట్టిన 230
మందిలో నలుగురిని విడిచిపెట్టింది. వారిలో ఇద్దరు అమెరికా పౌరులు. హమాస్,
ఇజ్రాయెల్‌కు బందీల మార్పిడి ప్రతిపాదన చేసింది. ఎన్నోయేళ్ళుగా ఇజ్రాయెల్ బంధించి
ఉంచిన తమ వారిని వదిలిపెడితే, తాము అక్టోబర్ 7న కిడ్నాప్ చేసిన ఇజ్రాయెలీ బందీలను
విడిచిపెడతామని ప్రకటించింది. కానీ దానికి ఇజ్రాయెల్ ఒప్పుకోలేదు.
హమాస్ వద్ద బందీలుగా ఉన్న తమవారిని ఎలాగైనా
విడిపించుకోవాలనే ఉద్దేశంతో ఇజ్రాయెల్ అడుగులు వేస్తోంది. సోమవారం గాజా ప్రాంతంలోని
జేతున్ జిల్లాలోకి ఇజ్రాయెలీ యుద్ధట్యాంకులు ప్రవేశించాయి. ఒకపక్క గగనతల దాడులు చేస్తూనే భూతలం నుంచి కూడా
దాడులు చేయాలని ఇజ్రాయెల్ భావిస్తోంది.
హమాస్ ఉగ్రవాదులు నిర్బంధించిన వారిలో
షానీ లౌక్ అనే ఒక జర్మన్ మహిళ కూడా ఉన్నారు. గాజా సరిహద్దుల్లోని ఇజ్రాయెల్
ప్రాంతంలో ఒక మ్యూజిక్ ఫెస్టివల్‌పై దాడి చేసినప్పుడు, ఉగ్రవాదులు ఆమెను కిడ్నాప్
చేసి, ఒక వ్యాన్‌లో ఎక్కించి, నగ్నంగా ఊరేగించారు. ఆ మహిళ చనిపోయినట్లు సోమవారం
ధ్రువీకరించారు.
సోమవారం
నాడు ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సమావేశానికి ఇజ్రాయెల్ రాయబారి గిలాద్ ఎర్డాన్ తన
ఛాతీపై పసుపురంగు నక్షత్రం బొమ్మ ధరించి హాజరయ్యారు. హమాస్ అకృత్యాలను భద్రతామండలి
సభ్యులు ఖండిస్తూ తీర్మానం చేసేవరకూ తాను ఆ నక్షత్రాన్ని ధరించే ఉంటానని ప్రతిన
పూనారు. తమ దేశం మీద హమాస్ చేసిన దారుణమైన
దాడుల విషయంలో భద్రతా మండలి మౌనంగా ఉండిపోడాన్ని ఆయన తప్పుపట్టారు.