సర్థార్ వల్లభాయ్ పటేల్ 148వ జయంతి సందర్భంగా గుజరాత్లోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ వద్ద ప్రధాని మోదీ ఘన నివాళులర్పించారు. గుజరాత్లోని నర్మదా నదీతీరం ఏక్తా నగర్ వద్ద జరిగిన జాతీయ ఐక్యతా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. సర్ధార్ పటేల్ జయంతి వేడుకల్లో పాల్గొన్న వారితో ప్రధాని మోదీ దేశ ఐక్యతపై ప్రమాణం చేయించారు.
ఉక్కుమనిషి సర్ధార్ పటేల్ 148వ జయంతి వేడుకల్లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద సైనికులు, గుజరాత్ పోలీసులు పరేడ్ నిర్వహించారు. 2014 నుంచి అక్టోబర్ 31న జాతీయ ఐక్యతా దినం (national unity day)గా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించారు. వేలాది మంది ఈ పరుగులో పాల్గొన్నారు.
స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద మహిళలు నిర్వహించిన వేడుకల్లో పలు ప్రదర్శలు అబ్బురపరచాయి. మహిళా సీఆర్పీఎఫ్ బైకర్ల విన్యాసాలు, మహిళల బీఎస్ఎఫ్ బ్యాండ్, గుజరాత్ మహిళా పోలీసుల నృత్యాలు, ఎన్సీసీ క్యాడెట్ల ప్రత్యేక కార్యక్రమాలు, పాఠశాల విద్యార్థుల బ్యాండ్ ప్రదర్శనలు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.