బిల్లుల ఆమోదంలో ఆలస్యం చేస్తున్నారంటూ గవర్నర్ ఆర్.ఎన్.రవిపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేసింది. అసెంబ్లీలో ఆమోదం తెలిపి గవర్నర్‌కు పంపిన బిల్లుల ఆమోదంలో గవర్నర్ ఆలస్యం చేస్తున్నారని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటీషన్ వేయడం సంచలనంగా మారింది.
రాజ్యాంగంలోని అధికరణ 32 కింద తమిళనాడు ప్రభుత్వం ఈ పిటీషన్ దాఖలు చేసింది. అసెంబ్లీ ఆమోదం తెలిపి పంపిన బిల్లులను గవర్నర్ సుదీర్ఘ కాలం పక్కనబెట్టడం రాజ్యాంగ విరుద్దమని, అక్రమమని, ఏకపక్షం, అసంబద్దమంటూ తమిళనాడు ప్రభుత్వం వేసిన పిటీషన్లో పేర్కొంది. ఇది ఒక రకంగా అధికార దుర్వినియోగమంటూ పిటీషన్లో వెల్లడించారు.
తమిళనాడు అసెంబ్లీ ఆమోదించి పంపిన 12 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, అవి సకాలంలో ఆమోదం పొందకపోతే నిర్వీర్యం అయ్యే అవకాశముందని రిట్ పిటీషన్లో కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ అధికారులపై అవినీతి కేసుల విచారణకు అనుమతులతోపాటు, ఖైదీల ముందస్తు విడుదలకు సంబంధించిన దస్త్రాలు కూడా ఆమోదం పొందలేదని తమిళనాడు ప్రభుత్వం పిటీషన్‌తో తెలిపింది. రోజువారీ దస్త్రాలు, ఉపశమనం ఆర్డర్లు, నియామకాల దస్త్రాలు కూడా ఆమోదం పొందలేదని తమిళనాడు ప్రభుత్వం ఆరోపించింది. మొత్తం రాష్ట్ర పరిపాలన స్తంభించిపోయే ప్రమాదం ఏర్పడిందని పిటీషన్లో పేర్కొన్నారు.