Afghanistan defeated Sri Lanka
ఐసీసీ వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా సోమవారం పుణేలో
జరిగిన మ్యాచ్‌లో ఆప్ఘనిస్తాన్ జట్టు శ్రీలంకపై సంచలన విజయం నమోదు చేసింది. 7
వికెట్ల ఆధిక్యంతో లంకేయులను మట్టి కరిపించింది.
టాస్ గెలిచిన ఆప్ఘనిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో శ్రీలంక జట్టు మొదట
బ్యాటింగ్ చేసింది. ఆప్ఘనిస్తాన్ పేస్ బౌలర్ ఫారూఖీ, స్పిన్ బౌలర్లు ముజీబ్, రషీద్
ఖాన్ చక్కటి బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు. శ్రీలంక బ్యాట్స్‌మెన్ ముందునుంచీ
తడబడుతూనే ఉన్నారు. టీమ్ స్కోర్ 22 పరుగుల దగ్గర ఉండగా ఆరో ఓవర్లో కరుణరత్నె 15 పరుగుల
వ్యక్తిగత స్కోరు దగ్గర ఔట్ అయ్యాడు. తర్వాత ఓపెనర్ నిశాంక, కుశల్ మెండిస్ కొంతసేపు
బాగానే ఆడారు. రెండో వికెట్‌కు 62 పరుగులు జోడించి, నిశాంక 46 పరుగుల వ్యక్తిగత
స్కోరు దగ్గర ఔటయ్యాడు. తర్వాత కుశల్ మెండిస్, సమరవిక్రమ జోడీ కొంతసేపు బాగానే
నిలదొక్కుకుంది. ఆప్ఘన్ బౌలర్ ముజీబ్ రెండు వరుస ఓవర్లలో నిశాంక, సమరవిక్రమలను ఔట్
చేసాడు. అక్కడినుంచీ శ్రీలంక క్రమంగా వికెట్లు కోల్పోయింది. 40 ఓవర్లు ముగిసేసరికి
185 పరుగులతో కష్టాల్లో ఉన్న లంక జట్టును మాథ్యూస్, తీక్షణ కొద్దిసేపు
నిలబెట్టగలిగారు. 8వ వికెట్‌కు 45 పరుగులు జోడించి, స్కోర్ 230కి చేర్చారు. తర్వాత
లంక జట్టు కేవలం 11 పరుగులు చేసి మిగిలిన రెండు వికెట్లను కోల్పోయింది.
తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆప్ఘనిస్తాన్, ఆట మొదలవుతుండగానే ఓపెనర్
గుర్బాజ్ ఔటయ్యాడు. మరో ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్, రహమత్ షాతో కలిసి జట్టు స్కోరును
73కు తీసుకువెళ్ళాడు. 17వ ఓవర్లో 39 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర ఇబ్రహీం
పెవిలియన్ బాట పట్టాడు. తర్వాత వచ్చిన హష్మతుల్లాతో కలిసి రహమత్ షా నిలకడగా
పరుగులు తీసాడు. 28వ ఓవర్లో టీమ్ స్కోర్ 131 పరుగుల వద్ద రహమత్ షా 62 పరుగుల
వ్యక్తిగత స్కోరుతో పెవిలియన్ బాట పట్టాడు. తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన అజ్మతుల్లా
ఒమర్జాయ్ మొదటినుంచీ ధాటిగా ఆడాడు. అప్పటికే నిలదొక్కుకున్న హష్మతుల్లాతో కలిసి
చెలరేగిపోయాడు. వారిద్దరూ కలిసి 93 బంతుల్లో వంద పరుగులు సాధించారు. అజ్మతుల్లా 50
బంతుల్లో 50 పరుగులు చేసాడు. అప్పటికే హష్మతుల్లా హాఫ్ సెంచరీ పూర్తయింది.
హష్మతుల్లా 58, అజ్మతుల్లా 73 వ్యక్తిగత స్కోర్ సాధించి… 45.2 ఓవర్లలోనే 242
పరుగుల లక్ష్యాన్ని పూర్తి చేసారు. శ్రీలంక బౌలర్లు ఏ దశలోనూ ఆప్ఘనిస్తాన్‌ను
నియంత్రించలేకపోయారు.