ఏపీ ట్రాఫిక్ చలానాల కుంభకోణం కేసు కీలక మలుపు తిరిగింది. ఈ స్కాంపై హైదరాబాద్ ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. వెంటనే దర్యాప్తు ప్రారంభించనున్నారు. ట్రాఫిక్ చలానాల కుంభకోణంలో కాజేసిన రూ.36 కోట్లను ఎలా దారి మళ్లించారనే దానిపై ఈడీ విచారణ జరపనుంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ ( Prevention on money landering act) కింద ఈడీ కేసు నమోదు చేసింది.ఈ కేసులో ఏపీ మాజీ డీజీపీ నండూరి సాంబశివరావు అల్లుడు కొమ్మిరెడ్డి అవినాష్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు.
అవినాష్‌కు చెందిన డేటా ఎవాల్వ్ సంస్థతో పాటు మరికొందరు కూడా ఈ స్కాంలో ఉన్నారని తిరుపతి పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినవారు చెల్లించే చలానాల సొమ్ము రూ.36.53 కోట్లు దారి మళ్లించారని కొమ్మిరెడ్డి అవినాష్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులు చెల్లించే నగదు, పేమెంట్ గేట్‌వే ద్వారా పోలీసు శాఖకు చేరుతుంది. నండూరి సాంబశివరావు డీజీపీగా ఉండగా ఆయన అల్లుడు కొమ్మిరెడ్డి అవినాష్ ఈ గేట్ వే కాంట్రాక్టు పొందారు. రోజర్ యాప్ ద్వారా చలానాల సొమ్ము పోలీసు శాఖకు చేరుతుంది. రోజర్ యాప్ పీఈ పేరుతో క్లోనింగ్ యాప్ తయారు చేసి రూ.36.53 కోట్ల సొమ్ము దారి మళ్లించారని ఆలస్యంగా గుర్తించిన తిరుపతి పోలీసులు కేసు నమోదు చేయడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.