విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదం (train accident)లో గాయపడి చికిత్స పొందుతున్న వారిని విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో సీఎం జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. రైలు ప్రమాద క్షతగాత్రులకు, వారి కుటుంబ సభ్యులకు సీఎం ధైర్యం చెప్పారు. బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం హెలికాఫ్టర్ నుంచి ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులకు ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది. గాయపడిన వారి చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వం భరిస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.
ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో ప్రమాదం జరగడంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయారు. యుద్ధ ప్రాతిపదికన రైల్వే అధికారులు ట్రాక్ పునరుద్దరణ పనులు చేపట్టారు. ఇవాళ మధ్నాహ్నం 3 గంటలకు ట్రాక్ పునరుద్దరణ పూర్తి చేసి, గూడ్సు రైలు నడిపారు. ట్రైల్ రన్ విజయవంతం కావడంతో ఆ మార్గంలో రైళ్లను పునరుద్దరించారు.
విజయనగరం రైలు ప్రమాదంలో 13 మంది మరణించారు. వీరిలో 11 మందిని ఇప్పటికే గుర్తించారు. మరో ఇద్దరిని గుర్తించాల్సి ఉంది. మృతదేహాలను విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఉంచారు. ఈ ప్రమాదంలో 54 మంది గాయపడ్డారు. వారికి విజయనగరం, విశాఖ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.