Questions on Islam and
Eid in Sanskrit Exam, that too in Hindi language
సంస్కృతాన్ని దేవభాషగా పరిగణిస్తారు.
భారతీయ సంప్రదాయిక సాహిత్యం అంతా సంస్కృత భాష నుంచే మొదలైంది. దేశానికి బ్రిటిష్
వారి నుంచి భౌతిక స్వాతంత్ర్యం వచ్చాక, వారి ఇంగ్లీషు భాష పట్ల మానసిక దాస్యం పెరిగిపోయాక సంస్కృత భాష పాలకుల ఆదరణ
కోల్పోయింది. క్రమంగా దాన్ని ప్రజలకు దూరం చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. చివరికి,
బోర్డు పరీక్షల్లో సంస్కృతం ఒక పాఠ్యాంశంగా పెట్టినా, దానికి ఇంగ్లీషు లేదా
ప్రాంతీయ భాషల్లో జవాబులు రాస్తే చాలునని నిర్ణయించేసారు.
ఇప్పుడు సంస్కృతం పరిస్థితి ఏంటంటే పరీక్షల్లో
ఎక్కువ మార్కులు తెచ్చుకోడానికి తప్ప మరే విధంగానూ ఆ భాషతో అవసరం లేదు. సంస్కృత
భాష నేర్వడం ద్వారా భారతీయులకు, ప్రత్యేకించి హిందువులకు తమ ప్రాచీన ఘనతను తెలుసుకునే
అవకాశం ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు సంస్కృతాన్ని నేర్చుకోవలసిన అవసరమే లేదు. పరీక్షల
వరకూ ముక్కున పట్టి, దాన్ని జిర్రున చీదేసినా చాలు. అంతేకాదు, మృతభాష అంటూ దానిపై
ఒక ముద్ర కూడా వేసేసారు. సంస్కృతం నేర్పే పండితులకూ, నేర్చుకునే విద్యార్ధులకూ
ఛాందసులన్న ముద్ర వేసేసారు. ఆ విధంగా భారతీయులను, ముఖ్యంగా హిందువులను తమ నిజమైన
అస్తిత్వపు ఘనతను తెలుసుకునే మార్గం నుంచి దూరం చేసేసారు. చదువుల చెట్టును సమూలంగా
నిర్మూలించే ప్రక్రియలో ఇది ప్రధానమైన ఘట్టం.
ఇప్పటికీ దేశంలో సంస్కృతం నేర్పుతున్నారు
కదా అని వాదించే వారు ఉండనే ఉంటారు. నామమాత్రావశిష్టంగా ఉన్న సంస్కృతభాషను
విద్యార్ధుల నుంచి దూరం చేయడానికి బహుళ ప్రయత్నాలే జరుగుతున్నాయి. మన రాష్ట్రంలో
వచ్చే విద్యాసంవత్సరం నుంచీ పాఠశాల విద్యలో కొన్నిచోట్ల కొద్దిమార్కులతో
కొడిగట్టిన దీపంలా ఉంచిన సంస్కృతం పరీక్షను ఎత్తివేస్తున్నారు. నిజానికి విద్యాశాఖ
మంత్రి బొత్స సత్యనారాయణ ఈ సంవత్సరం నుంచే తొలగించేద్దామనుకున్నారు కానీ
విద్యాసంవత్సరం మధ్యలో తమ పొట్ట కొట్టవద్దంటూ సంస్కృత ఉపాధ్యాయులు
మొరపెట్టుకోవడంతో కనికరించారు. అంతేకాదు, సంస్కృతం నేర్చుకుంటే ఏ ఉద్యోగాలూ రావంటూ
మంత్రివర్యులు అపహాస్యం కూడా చేసారు.
అలా దేశంలో అక్కడక్కడా కొద్దిమంది
వ్యక్తిగత ఆసక్తితో నేర్చుకునే కొద్దిపాటి సంస్కృతాన్ని సైతం దాని భారతీయ మూలాల
నుంచి దూరం చేస్తున్నారు. ప్రజాస్వామ్యం, సర్వమత సమానత్వం, లౌకికవాదం వంటి కుహనా
పదప్రయోగాలతో సంస్కృతం కేవలం హిందూధర్మానికి మాత్రమే చెందినది కాదని నిరూపించే ప్రయత్నాలు
జరుగుతున్నాయి. బిహార్ రాష్ట్రంలో తాజాగా, అక్టోబర్ 2023లో జరిగిన బోర్డు పరీక్షలే దానికి నిదర్శనం. ఆ
పరీక్షల్లో సంస్కృతం ప్రశ్నాపత్రాన్ని మొత్తం ముస్లిం మతానికి సంబంధించిన
ప్రశ్నలతో నింపేసారు. అసలు సంస్కృతం సిలబస్లో ముస్లిం మతం గురించిన పాఠం ఎందుకు
పెట్టారో తెలియదు. సరే, లౌకికవాదాన్ని పరిరక్షించే పేరుతో పెట్టారే అనుకుందాం. ఆ
ఒక్క పాఠం నుంచే పరీక్షలో సగానికి సగం ప్రశ్నలు ఇవ్వడం దేనికి సూచిక?
బిహార్ స్టేట్ బోర్డు 9వ తరగతి మాసిక
పరీక్షల్లో 50 మార్కులకు సంస్కృత పరీక్ష నిర్వహించారు. అందులో 25 మార్కులకు బహుళైచ్ఛిక
ప్రశ్నలు ఇచ్చారు. అంటే, కళ్ళు మూసుకుని ఏ, బీ, సీ, డీ ఆప్షన్లలో ఏదో ఒకటి
ఎంచుకునే ప్రశ్నలన్న మాట. తర్వాత విభాగంలో రెండు మార్కుల ప్రశ్నలు పది ఇచ్చి
వాటిలో ఏవో ఒక ఐదు ప్రశ్నలకు జవాబులు రాయమని ఐచ్ఛికం ఇచ్చారు. అందులో ఐదు ప్రశ్నలు
ముస్లిం మతం గురించినవే ఉన్నాయి. చివరి విభాగంలో ఐదు మార్కులకు ఐదు ప్రశ్నలిచ్చి
వాటిలో మూడు ప్రశ్నలకు జవాబులు రాయమన్నారు. వాటిలో రెండు ప్రశ్నలు ముస్లిం మతానికి
చెందినవే. అంటే… ఒకే పాఠం నుంచి గంపగుత్తగా ప్రశ్నలు సంధించేసారన్న మాట. విషయం
ఏంటన్నది పక్కన పెట్టినా ఒకే పాఠం నుంచి 25మార్కులకు గాను 20 మార్కులకు ప్రశ్నలు
ఇచ్చేసారు. అసలది ఎలా సాధ్యం?
సరే, ఆ ప్రశ్నలు ఏమిటో ఒక్కసారి చూద్దాం.
రెండు మార్కుల ప్రశ్నల్లో మొదటి ఐదు ప్రశ్నలూ ఇలా ఉన్నాయి.
(1) ఇఫ్తార్ అంటే ఏమిటి?
(2) రోజా ఎప్పుడు విడుస్తారు. ఎలా విడిచిపెడతారు?
(3) ఫిత్రా అని దేన్ని అంటారు?
(4) ఈద్ పండుగ రోజు ఏమేం పిండీవంటలు
వండుతారు?
(5) ఈద్ పండుగ ఎలా జరుపుకుంటారు?
మిగతా ఐదు ప్రశ్నలూ మామూలు ప్రశ్నలు. అవి
ఏ మతానికీ సంబంధించినవి కావు. అంటే, ఒక విద్యార్ధి ఇస్లాం గురించిన పాఠం ఒక్కటీ
చదువుకుంటే ఈ విభాగంలో 10కి 10 మార్కులూ తెచ్చేసుకోవచ్చు.
ఐదు మార్కుల ప్రశ్నలు మూడు రాయాలి కదా.
వాటిలో రెండు ప్రశ్నలు మళ్ళీ అదే ఇస్లాం పాఠం నుంచి ఇచ్చేసారు. ఈ రెండు ప్రశ్నలకూ
జవాబులు రాస్తే 10 మార్కులు వచ్చేసినట్లే. అవేంటంటే…
(1) ఈద్ పండుగ రోజు ఏం చేయాలి?
(2) ఈద్ పండుగ ఇచ్చే సందేశమేమిటి?
అంటే, ఈద్ పండుగ గురించిన పాఠం ఒక్కటీ
వస్తే చాలు… 25 మార్కులకు గాను 20 మార్కులు ఇచ్చేస్తారు. అలా అని మిగతా ప్రశ్నలు
హిందూధర్మం గురించి ఉన్నాయా అంటే, అలా ఏమీ లేదు. సాధారణ నీతిసూత్రాలు, మామూలు
విషయాల గురించిన పాఠాల నుంచి ప్రశ్నలున్నాయి. అవన్నీ చదవాల్సిన అవసరం లేకుండా ఒక్క
ఈద్ పాఠం ఒక్కటీ చదువుకుంటే పాతిక మార్కులు వచ్చి ఒళ్ళో వాలతాయి. అలాంటి
పరిస్థితుల్లో ఏ విద్యార్ధి అయినా దేనికి ప్రాధాన్యతనిస్తాడు? ఇంకో ఆసక్తికరమైన విషయం
ఏంటంటే, ఈ ప్రశ్నలన్నీ హిందీలోనే ఉన్నాయి. అంటే కనీసం ప్రశ్న చదివేటంతటి సంస్కృతం
కూడా రానక్కరలేదన్నమాట.
అలా, చిన్నప్పటినుంచీ ముస్లిముల పండుగల
గురించి సంస్కృతం సిలబస్లో ప్రచారం చేస్తున్నారు. అది దేనికి దారితీస్తుంది?
ఇప్పటికే హిందూమతం అంటే చులకన భావం విపరీతంగా పెరిగిపోయింది. దాన్ని మరింత విస్తరించే
కుట్రలో భాగమే ఈ పరీక్షా ప్రశ్నా పత్రం అని ఆరోపిస్తే ఏం జవాబు చెబుతారు? ఈ పాఠాలు
చదువుకున్న పిల్లలు వాటి ప్రభావానికి లోనవకుండా ఉంటారా? హిందూ సంప్రదాయాలు
తెలియకుండా, ముస్లిం ఆచార వ్యవహారాలు మాత్రం తెలుసుకుంటే సరిపోతుందా?ఇది హిందూ
ధర్మంపై ప్రచ్ఛన్న దాడి కాదా? సంస్కృతాన్ని భారతీయులకు, హిందువులకు దూరం చేయడం కాదా? ఇలాంటి ప్రయత్నాలను
ఎలా ఎదుర్కోవాలి? అన్న విషయాలపై హిందూ సమాజం తప్పకుండా ఆలోచించాలి.