దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోకి డీజిల్ బస్సుల ప్రవేశాన్ని నిషేధించినట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ సోమవారం మీడియాకు వెల్లడించారు.
గత ఏడాది అక్టోబరు 29న ఢిల్లీలో గాలి నాణ్యత 397కు పడిపోయిందని, ఈ ఏడాది అక్టోబరు 29న 325గా ఉందని మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. గత ఏడాది కన్నా గాలి నాణ్యత మెరుగైనట్లు ఆయన చెప్పారు. ఇంకా గాలి నాణ్యత పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు ప్రకటించారు. శీతాకాలంలో రాబోయే 15 రోజులు చాలా కీలకమని ఆయన వ్యాఖ్యానించారు. ఢిల్లీ పరిదిలోని కాలుష్యం వెదజల్లే పరిశ్రమలు గ్యాస్‌తో నడిచేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఎవరైనా కాలుష్యం ఎక్కువగా వచ్చే ఇంధనం వాడుతున్నారనే విషయాలను పసిగట్టేందుకు అనేక బృందాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రెడ్ లైట్ పడగానే వాహనాల ఇంజన్లు ఆపాలని ఆయన సూచించారు.
డీజిల్‌తో నడిచే బస్సులను కేంద్రం రద్దు చేయాలని కోరారు. బీఎస్ 3, బీఎస్ 4 తరహా బస్సులను నిలిపేసే విషయాన్ని హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు అమలు చేసేలా కేంద్రం ఒత్తిడి తేవాలని మంత్రి సూచించారు. ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో మంత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.