ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టులో మరలా నిరాశే ఎదురైంది. సిసోడియా పెట్టుకున్న బెయిల్ పిటీషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కుంభకోణంలో నగదు లావాదేవీలు ఉన్నట్లు ఆధారాలున్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
ఈడీ రూ.338 కోట్ల నగదు బదిలీకి సంబంధించిన ఆధారాలు సమర్పించిందని సుప్రీంకోర్టు వెల్లడించింది. విచారణ దశలో బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని ధర్మాసనం తేల్చి చెప్పింది. అయితే కేసును 6 నుంచి 8 నెలల్లో పూర్తి చేయాలని ఈడీ, సీబీఐ అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది. మూడు నెలల్లోగా సిసోడియా బెయిల్ కోసం మరోసారి పిటిషన్ వేసుకోవచ్చని కోర్టు తీర్పులో వెల్లడించింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం (delhi licquor scam)లో ఫిబ్రవరి 26న మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సిసోడియా కస్టడీపై తిహార్ జైల్లో ఉన్నారు. కింది కోర్టులో సిసోడియాకు బెయిల్ లభించకపోవడంతో ఆయన తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈడీ, సీబీఐ కేసుల్లో వేర్వేరుగా బెయిల్ పిటిషన్లు వేశారు.