కేరళ కొచ్చి సమీపంలోని కలమసెరి క్రిష్టియన్ కన్వెన్షన్ కేంద్రంలో చోటు చేసుకున్న పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య మూడుకు చేరింది. చనిపోయిన వారిలో ఇద్దరు మహిళలు కాగా, 12 ఏళ్ల పాప కూడా ఉన్నారు. ఆదివారం ప్రార్థనలు చేసుకునేందుకు దాదాపు 2 వేల మంది క్రిస్టియన్ కన్వెన్షన్ కేంద్రానికి చేరుకున్నారు. ప్రార్థనలు జరిగే కేంద్రం మధ్యలో టిఫిన్ బాక్సు బాంబు పేలి ఒకరు అక్కడికక్కడే చనిపోయిన సంగతి తెలిసిందే. మరో ఇద్దరు చికిత్స పొందతూ చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 52 మంది గాయపడ్డారు. వారిలో చాలా మందికి 50 శాతంపైగా శరీరం కాలిపోయినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదముందని అధికారులు చెబుతున్నారు.
క్రిస్టియన్ కన్వెన్షన్ కేంద్రం (kerala blasts)లో బాంబు పేలుళ్లకు తానే బాధ్యుడినంటూ త్రిశూర్‌కు చెందిన డొమినిక్ మార్టిన్ పోలీసుల ముందు లొంగిపోయాడు. తాను కూడా జెహోవాలో సభ్యుడినని, బాంబు పెట్టింది తానేనని ప్రకటించినట్లు సమాచారం అందుతోంది. అతడు చెప్పిన విషయాలు నిజమా కాదా? అనే విషయాలను పోలీసులు విచారణ చేస్తున్నారు. జెహోవా సైద్దాంతిక బోధనలపై తనకు అభ్యంతరాలున్నాయని అయినా ఆ సంస్థ వాటిని తోసిపుచ్చిందని మార్టిన్ చెబుతున్నారు. కేరళ పేలుళ్లతో దేశ వ్యాప్తంగా కీలక ప్రాంతాల్లో అలర్ట్ ప్రకటించారు.