విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి రెండు రైళ్లు ఢీ కొన్న దుర్ఘటనలో 13 మంది అక్కడికక్కడే చనిపోయారు. 54 మంది గాయపడ్డారు.గాయపడిన వారిని విశాఖపట్నం, విజయనగరం ఆసుపత్రులకు తరలించారు. ఆదివారం రాత్రి గం.7.10 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగినట్లు ప్రయాణీకులు చెబుతున్నారు.
విశాఖ నుంచి పలాస వెళుతోన్న స్పెషల్ ప్యాసింజర్ రైలు , కొత్తవలస మండలం అలమండ కంటకాపల్లి సిగ్నల్ కోసం ఆగిఉన్న సమయంలో, వెనుక వైపు నుంచి వేగంగా వచ్చిన విశాఖ రాయగడ రైలు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంపై రైల్వే బోర్డు గ్రూపులో డీఆర్ఎం సమాచారం అందించారు. ప్రమాదం జరిగిన వెంటనే రెవెన్యూ, ఎన్డీఆర్ఎఫ్, పోలీసు సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
ఈ ప్రమాదంలో మూడు బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. రైళ్లు బలంగా ఢీ కొనడంతో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. రాత్రి సమయంలో ప్రమాదం చోటు చేసుకోవడంతో అక్కడ సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. మృతుల సంఖ్య పెరిగే ప్రమాదముందని అధికారులు చెబుతున్నారు.
రైలు ప్రమాదం జరిగిన వెంటనే మంత్రి బొత్స సత్యనారాయణ, విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ దీపికా పాటిల్ ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. ప్యాసింజర్ రైలు కావడంతో చనిపోయిన వారి వివరాలు గుర్తించడం కష్టంగా మారింది. కీలక రైలు మార్గంలో రైలు ప్రమాదం జరగడంతో ఆ మార్గంలో తిరిగే 60 రైళ్లు రద్దు చేశారు. ఇవాళ మధ్యాహ్నం నాటికి ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు సాగించే అవకాశముంది.
సీఎం జగన్మోహన్రెడ్డి కాసేపట్లో ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు. ఈ ఘటనపై ప్రధాని, సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో చనిపోయిన వారికి ప్రధానమంత్రి రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. రైలు ప్రమాదంలో చనిపోయిన ఏపీ వారికి రూ.10 లక్షలు, ఇతర రాష్ట్రాల వారికి రూ.2 లక్షల చొప్పన సీఎం జగన్మోహన్రెడ్డి పరిహారం ప్రకటించారు.