అభివృద్ధి అంతిమ లక్ష్యం సామాన్యుడి సాధికారతే అని, యువత జీవితంలో ఇష్టపడి కష్టపడి జీవితంలో ఎదగటమే గాక, సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని ఆత్కూర్ స్వర్ణభారత్ ట్రస్ట్ లో జరిగిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) అమృతోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తన విద్యార్థి జీవితంలో కీలక పాత్ర పోషించిన సంస్థ అమృతోత్సవాల్లో పాల్గొనటం ఆనందంగా ఉందన్న ఆయన, ఏబివిపి అందిస్తున్న సేవలు అమూల్యమైనవని తెలిపారు.
క్రమశిక్షణ, దేశభక్తి, చిత్తశుద్ధి, కార్యదీక్షతో భవిష్యత్ భారత నిర్మాణం దిశగా సాగుతున్న విద్యార్థులకు వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) అభినందనలు తెలియజేశారు. విద్యార్థి నాయకుడిగా ఏబివిపిలో, ఆర్ఎస్ఎస్లో, అనంతరం భారతీయ జనతాపార్టీలో తాను ఎదిగిన తీరును గుర్తు చేసుకున్నారు. సంఘ్ తనకు క్యారక్టర్ ఇస్తే, ఏబివిపి నాయకత్వ లక్షణాలతో తమ జీవితాన్ని మలుపు తిప్పిందన్నారు.
ఏబివిపితో మనం నడిచేది కొంత దూరమే… కానీ ఆ దూరం మన భవిష్యత్ గమనానికి పునాది అవుతుందని వెంకయ్యానాయుడు పేర్కొన్నారు. క్షణం క్షణం… మా కణం కణం… భారత మాతకే సమర్పణం అనే నినాదంలోని స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవలసిన అవసరం ఉందన్న ఆయన, వివక్షకు అతీతంగా అన్నివైపుల నుంచి విజ్ఞానాన్ని స్వాగతించాలన్న రుగ్వేద వాక్యాన్ని గుర్తు చేశారు.
మాతృభాషను మరువకూడదని దిశానిర్దేశం చేసిన వెంయ్యనాయుడు, మన మాతృ భాష తెలియని వారితో మాట్లాడేందుకు ఇతర భాషలకు కూడా నేర్చుకోవాలని సూచించారు. విజ్ఞానంలో భారతదేశ పూర్వ వైభవాన్ని ప్రస్తావించిన ఆయన, “మనం భారతీయులకు ఎంతో రుణపడి ఉన్నాం. వారు మనకు ఎలా లెక్కించాలో నేర్పారు. అదే తెలియకపోతే ఇప్పటి వరకూ ప్రపంచంలో ఇంత శాస్త్రీయ పరిశోధన జరిగి ఉండేది కాదేమో” అన్న ఐన్ స్టీన్ మాటలను గుర్తు చేశారు. అన్ని రంగాల్లో భారతదేశం ఎదుగుతున్న విషయాన్ని ప్రస్తావించిన ముప్పవరపు వెంకయ్యనాయుడు, ఇందులో యువత భాగస్వామ్యం అత్యంత కీలకమన్నారు.
ఒత్తిడితో కూడిన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, చైతన్యరహితమైన పని విధానం… తదితర అంశాలు అనారోగ్యాలకు చేరువ చేస్తున్నాయని వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. యోగ, నడక, వ్యాయామం ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని ఆయన తెలిపారు. అహారపు అలవాట్లు మారిపోయి, ప్రతి ఒక్కరూ ఫాస్ట్ ఫుడ్ సంస్కృతి వైపు వెళుతున్నారని, ఈ పరిస్థితికి చరమ గీతం పాడి భారతీయ ఆహారపు అలవాట్ల మీద దృష్టి కేంద్రీకరించాలని హితవు పలికారు. మన పెద్దలు కాలానుగుణంగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని మనకు సూచించారని, వారు చూపిన బాటలో ముందుకు సాగి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వెంకయ్యనాయుడు తెలిపారు.
జాతీయ నూతన విద్యావిధానంలో ఇదే స్ఫూర్తి కనిపిస్తోందన్న ముప్పవరపు వెంకయ్యనాయుడు, మాతృభాషకు పెద్ద పీట వేస్తూ, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ విధానం సమగ్రమైనది, సంపూర్ణమైనది, దూరదృష్టి గలదని పేర్కొన్నారు. చదువుకున్న వారి సంఖ్య పెరుగుతున్నా… పరిశోధకుల సంఖ్య, నైపుణ్యం కలిగిన వారి సంఖ్య అదే స్థాయిలో పెరగటం లేదన్న ఆయన, జాతీయ విద్యావిధానం ఈ లోటును భర్తీ చేయగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతి సమస్యకు ఎదురొడ్డి పోరాడిన భారతదేశ చరిత్ర మనకు ప్రేరణనిస్తుందన్న ఆయన, మున్ముందు కూడా అదే స్ఫూర్తి మనల్ని ముందుకు నడపగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.
అమృతోత్సవ్ కార్యక్రమంలో ఏబివిపి రాష్ట్ర అధ్యక్షులు మురళీధర రావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి, భారతీయ మజ్దూర్ సంఘ్ అఖిలభారత సంఘటనా కార్యదర్శి సురేంద్రన్, ఏబివిపి రాష్ట్ర కార్యదర్శి యాచేంద్ర సహా పలువురు జ్యేష్ఠ కార్యకర్తలు, విద్యార్థి నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.