కేరళలోని కొచ్చినగర సమీపంలోని కలమసెరి క్రిస్టియన్ కన్వెన్షన్ కేంద్రంలో జరిగిన పేలుళ్లలో ఒకరు చనిపోయారు. 36 మంది తీవ్రంగా గాయపడ్డారు. కొచ్చికి 10 కి.మీ దూరంలోని కలమసేరి క్రిస్టియన్ కన్వెన్షన్ కేంద్రంలో 2 వేల మందితో ప్రార్థనలు ప్రారంభం కాగానే మూడు చోట్ల వరుస పేలుళ్లు చోటుచేసుకున్నాయి. టిఫిన్ బాక్సులో పేలుడు పదార్థాలు ఉంచి ఘాతుకానికి పాల్పడినట్లు సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా గుర్తించారు.
ప్రార్థనా మందిరం మధ్యలో మొదటి పేలుడు సంభవించిందని కలమసేరి ఎంపీ హిబీ ఈడెన్ తెలిపారు. పేలుడు తరవాత తొక్కిసలాట జరిగినట్లు ఎంపీ చెప్పారు. ఈ ఘటనపై కేరళ సీఎం పినరయి విజయన్ స్పందించారు. పేలుళ్లను దురదృష్ణకర ఘటనగా అభివర్ణించారు. పేలుళ్లను చాలా సీరియస్గా తీసుకుంటున్నట్లు సీఎం స్పష్టం చేశారు. కేరళ డీఐజీ సహా ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
పేలుళ్ల వెనుక ఐసిస్ ఉగ్రవాదుల హస్త ముందనే అనుమానాలతో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ రంగంలోకి దిగింది. ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తోంది. మొదటి పేలుడు తరవాత కన్వెన్షన్ కేంద్రం నుంచి జనాలు పరుగులు తీయడం సీసీ టీవీ ఫుటేజీలో స్పష్టంగా కనిపించింది.