ప్రతిపక్ష
నేతలను తిట్టడం, సీఎంను మెప్పించడమే లక్ష్యంగా వైసీపీ నేతలు పనిచేస్తున్నారని
బీజేపీ నేత భాను ప్రకాశ్ రెడ్డి విమర్శించారు. వైసీపీలో అందరూ కొడాలి నానిలా
మాట్లాడాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు.
రాష్ట్ర
ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే మద్యం విక్రయాల్లో అక్రమాల గురించి బీజేపీ నేతలు
మాట్లాడితే ఎదురుదాడి చేయడం సరికాదన్నారు.
బీజేపీ ఆరోపణలు తప్పు అని నిరూపించే
దమ్ము వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఉందా అని ప్రశ్నించారు. విజయవాడలో బీజేపీ
కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన భాను ప్రకాశ్ రెడ్డి…
తమ
పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరికి విజయసాయి క్షమాపణలు చెప్పాలని డిమాండ్
చేశారు. రాష్ట్రాన్ని అరాచక, అవినీతి
ప్రదేశ్ గా మార్చారని దుయ్యబట్టారు. ఓటుకు లక్ష రూపాయలు ఇచ్చిన వైసీపీ గెలవదన్నారు.
సీఎం జగన్ స్టిక్కర్ సీఎంగా మిగిలిపోయారని ఎద్దేవా చేశారు.
వైసీపీ
రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మతిభ్రమించిన, మద్యం తాగిన వ్యక్తిలా
మాట్లాడుతున్నారని బీజేపీ మైనారిటీ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ ఘాటు విమర్శలు చేశారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైతే, గుండెపోటుతో చనిపోయారని చెప్పింది విజయసాయి
రెడ్డే కదా అని నిలదీశారు.
ఆడిటర్ తప్పుడు లెక్కలు రాసి 16 నెలలు జైల్లో ఉన్న
వ్యక్తి నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మద్యం నిషేధం గురించి వైసీపీ నేతలు
ఎందుకు మాట్లాడటం లేదో సమాధానం చెప్పాలన్నారు.