ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం రెండో దశకు చేరిందని, గాజాలోని ఉత్తర ప్రాంత ప్రజలు దక్షిణ ప్రాంతానికి తరలివెళ్లాలని ఐడీఎఫ్ ప్రతినిధి (idf chief) మరోసారి హెచ్చరించారు. ఉగ్రవాదులను ఏరివేసేందుకు సముద్ర, వైమానిక, భూతల దాడులు ముమ్మరం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. భూతల దాడులు తీవ్రం చేసినట్లు ప్రకటించారు. అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు దాడి చేసి తమ పౌరులను చంపివేసి పెద్ద తప్పే చేశారని, యుద్దం తాము ప్రారంభించలేదని, ఇందులో మేం మునిగిపోవడానికి సిద్దం లేనట్లు ఐడీఎఫ్ ప్రతినిధి, అడ్మిరల్ దానియెల్ హగారీ ఎక్స్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. వందలాది మంది ఇజ్రాయెల్ పౌరులను చంపడం, కొందరిని బందీలుగా తీసుకోవడం హమాస్ ఉగ్రవాదులు చేసిన పెద్ద నేరమని హగారీ చెప్పారు. మా యుద్ధం హమాస్ ఉగ్రవాదులతో మాత్రమేనని, గాజాలోని ప్రజలతో కాదని ఆయన స్పష్టం చేశారు.
ఉత్తరగాజాలోని పౌరులు తాత్కాలికంగా దక్షిణ గాజాకు తరలిపోవాలని హగారీ సూచించారు. ఎక్కడైతే మంచినీరు, ఆహారం, మందులు దొరుకుతున్నాయో అక్కడికి వెళ్లాలని చెప్పారు. గాజా పౌరులకు అమెరికా, ఈజిప్టు ఆధ్వర్యంలో మానవతా సాయం అందించడాన్ని మరింత పెంచనున్నట్లు తెలిపారు. గాజా ప్రజలను హమాస్ ఉగ్రవాదులు మానవ కవచాలుగా ఉపయోగించుకుంటున్నట్లు హగారీ పేర్కొన్నారు. ప్రజల భవనాల కింద సొరంగాల్లో హమాస్ తీవ్ర వాదులు నక్కి ఉన్నట్లు ఆయన అన్నారు.హమాస్ ఉగ్రవాదులతో తమ యుద్ధం రెండో దశకు చేరిందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ప్రకటించిన, రెండో రోజే ఐడిఎఫ్ ప్రతినిధి ఈ ప్రకటన చేయడం విశేషం.