తెలంగాణ
అసెంబ్లీ ఎన్నికల్లో(TS
ELECTIONS)
పోటీ చేయకూడదని టీడీపీ(TDP) నిర్ణయించింది. స్కిల్ కేసులో
అరెస్టై రాజమహేంద్రవరం జైల్లో జుడిషీయల్ రిమాండ్ లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు(CHANDRA BABU)తో ఆ పార్టీ తెలంగాణ చీఫ్ కాసాని జ్ఞానేశ్వర్ ములాఖత్ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ లోని
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల కారణంగా తెలంగాణపై దృష్టి పెట్టలేమని చంద్రబాబు
చెప్పినట్లు సమాచారం. ఏ పరిస్థితుల్లో పోటీకి దూరంగా ఉండాల్సి వస్తుందో తెలంగాణ
నేతలకు వివరించాలని కాసానికి సూచించినట్లు సమాచారం.
ఆంధప్రదేశ్ లో విజయం సాధిస్తే తెలంగాణలో సులభంగా
పార్టీ బలపడుతుందని చంద్రబాబు చెప్పినట్లు
తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకుంటే బాధపడాల్సి ఉంటుందని
సర్దిచెప్పినట్లు సమాచారం.
తెలంగాణలో ఆంధ్రా సెటిలర్లు ఈ సారి
కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నట్లు పలు సర్వేల్లో వెల్లడైంది. గత ఎన్నికల్లో కారు
గుర్తుకు ఓటేసిన సెటిలర్లు ఈ సారి ఆ పార్టీకి దూరం కాబోతున్నారని రాజకీయ
విశ్లేషకులు చెబుతున్నారు. చంద్రబాబు అరెస్టుపై బీఆర్ఎస్ నేతలు స్పందించిన తీరుతో
పాటు చంద్రబాబుకు మద్దతు గా చేపట్టిన కార్యక్రమాలను కేసీఆర్ ప్రభుత్వం అడ్డుకోవడం
పై సెటిలర్లు ఆగ్రహంగా ఉన్నారని వారంతా ఈసారి కాంగ్రెస్ వైపు తిరిగారని ప్రచారం
జరుగుతోంది.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేస్తున్న
సెటిలర్లు ఈ సారి హస్తం గుర్తుపై ఓటు వేసే అవకాశం ఉందని పోలిటికల్ సర్కిల్స్‌లో
చర్చ జరుగుతోంది. రేవంత్, చంద్రబాబు శిష్యుడు కావడం ఆయనకు కలిసి వస్తుందని జోస్యం
చెబుతున్నారు.
టీడీపీ పోటీ చేసి ఓట్లు చీలిస్తే బీఆర్ఎస్ లాభ పడుతుందనే లెక్కలు
కూడా ఉన్నాయి. టీడీపీ పోటీకీ దూరంగా ఉంటే ఆ పార్టీ ఓట్లు అన్నీ కాంగ్రెస్ కు బదిలీ
అవుతాయని అంచనా వేస్తున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు వెనుక
వైసీపీ, బీఆర్ఎస్, బీజేపీ లు ఉన్నాయని తెలంగాణ కాంగ్రెస్ నేత మధుయాష్కీ గతంలో
ఆరోపించారు.