హమాస్ ఉగ్రవాదులపై తమ యుద్ధం రెండో దశకు చేరిందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ప్రకటించారు. తమ సైన్యం భూతల దాడులతో హమాస్ ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. హమాస్ ఉగ్రవాదుల వద్ద బందీలుగా ఉన్నవారిని వెనక్కు తెచ్చేందుకు భూతల దాడులు ఉపకరిస్తాయని నెతన్యాహు అభిప్రాయపడ్డారు. తమ సైన్యం శత్రు భూభాగంలో ఉండి పోరాటం చేస్తోందని వారికి దేశ నాయకత్వం అండగా నిలుస్తోందని చెప్పారు. మా ఉనికిని కాపాడుకునేందుకు పోరాడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రపంచంలో ఉగ్రవాదాన్ని మట్టుబెట్టేందుకు, మానవజాతి మనగడకోసం యుద్ధం చేస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని పేర్కొన్నారు.
ఇజ్రాయెల్ యుద్ధం ఆపితే బందీలను వదిలేస్తామంటూ హమాస్ చేసిన ప్రకటనపై కూడా ప్రధాని నెతన్యాహు స్పందించారు. దీనిపై చర్చిస్తున్నామన్నారు. తమ సైన్యం చేపట్టిన ఆపరేషన్ దెబ్బకు హమాస్ ఉగ్రవాదులు దిగివచ్చారని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి గాల్లాంట్ తెలిపారు. బందీలను విడిపించడానికి ఇజ్రాయెల్ సైన్యం తీవ్రంగా పోరాడుతున్నట్లు ఆయన చెప్పారు. శనివారం రాత్రి ఇజ్రాయెల్ సైన్యం భూతల దాడులతో హమాస్ ఉగ్ర శిబిరాలపై విరుచుకుపడింది. హమాస్ ప్రధాన స్థావరాలపై ఇజ్రాయెల్ సైన్యం ట్యాంకులతో దాడులకు దిగింది.
హమాస్ ఉగ్రదాడులు మొదలయ్యాక ఆ ప్రాంతంలో ఇప్పటి వరకు 8 వేల మంది చనిపోయారు. వీరిలో సగం మంది చిన్నపిల్లలున్నారని ఐరాస ప్రకటించింది.