ఇజ్రాయెల్ హమాస్ ఉగ్రవాదుల మధ్య యుద్ధం ప్రారంభమయ్యాక గాజాలో ఏర్పడిన మానవ సంక్షోభంపై ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్తో ప్రధాని మోదీ చర్చలు జరిపారు. మధ్యప్రాచ్యంలో దిగుజారుతోన్న పరిస్థితులపై ఇరువురు నేతలు శనివారంనాడు చర్చించారు. మధ్యప్రాచ్యంలో ఉగ్రవాదం, హింస, సామాన్యుల మరణాలపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.
గాజాలో వెంటనే శాంతియుత వాతావరణాన్ని పునరుద్ధరించి స్థిరత్వాన్ని సాధించాల్సిన అవసరం ఉందని మోదీ, ఫతాహ్ అభిప్రాయపడ్డారు. బాధితులకు మానవతాసాయం అందించాల్సిన అవసరం ఉందన్నారు. గాజాపై ఇజ్రాయెల్ దాడులపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. గాజాలో పరిస్థితులు మరింత దిగజారితే ఏర్పడే ముప్పుపైనా ఇరువురు నేతలు చర్చించారు.
అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై జరిపిన మెరుపుదాడుల్లో 1400 మంది పౌరులు చనిపోయిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ ప్రతీకారదాడులకు దిగడంలో గాజాలో 5 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 220 మంది పౌరులు హమాస్ ఉగ్రవాదుల చెరలో చిక్కుకుని ఉన్నారు. ఇప్పటికే ఇజ్రాయెల్ భీకరదాడులతో వందలాది హమాస్ ఉగ్రవాదులను మట్టుబెట్టింది. భూతల దాడులు కూడా ప్రారంభించడంతో గాజాలో పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది.