AP history, culture and
literature are to be explored more
చరిత్ర, సంస్కృతి అధ్యయనంపై తెలుగువారు దృష్టి
సారించాలని ఆంధ్రప్రదేశ్హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ యు దుర్గాప్రసాదరావు అన్నారు. తెలుగుల
సాహిత్య వైభవానికి నిదర్శనమైన శ్రీనాథుడి కనకాభిషేకాన్ని ప్రముఖ నటుడు తనికెళ్ళ
భరణి వర్ణించారు. శాస్త్రసాంకేతిక రంగాల్లో తెలుగువారి ప్రతిభను కేంద్ర రక్షణశాఖ సలహాదారు
సతీష్ రెడ్డి వివరించారు. మూలాలను కాపాడుకునే సమాజానికే భవిష్యత్తు ఉంటుందన్నారు యూనివర్సిటీ
ఆఫ్ హైదరాబాద్ మెడికల్ స్కూల్ డీన్ ఫణితి ప్రకాష్‌బాబు. ఆంధ్రదేశంలో బౌద్ధం చరిత్ర
మరుగున పడిపోయిందని చరిత్రకారిణి ఈమని రాణీశర్మ ఆవేదన చెందారు.
‘సెంటర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టడీస్’ సంస్థ
ఇవాళ విజయవాడలో ‘ఆంధ్రప్రదేశ్ చరిత్ర – సంస్కృతి – వైభవము’ ప్రథమ సదస్సు కార్యక్రమం
నిర్వహించింది. తెలుగువారి చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని క్రమపద్ధతిలో నమోదు చేయాలన్న
సంకల్పంతో ఈ సంస్థ ఏర్పాటయింది. భారత చరిత్ర ప్రస్థానంలో తెలుగువారి ప్రత్యేక
స్థానానికి పునర్వైభవం కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలైంది. తెలుగువారి
చరిత్ర, సంస్కృతి, వైభవాలను వెలికితీసే క్రమంలో ఇది మొదటి అడుగని సంస్థ అధ్యక్షులు
కర్రి రామారెడ్డి వివరించారు.
తెలుగుజాతి సాంస్కృతిక అస్తిత్వాన్నీ, వారసత్వాన్నీ
కాపాడుకోవడంలో మునుపటి తరం తమ పెద్దలు చెప్పినట్లు నడుచుకుంటే, ప్రస్తుత తరం ప్రశ్నలు
సంధిస్తోందన్నారు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి దుర్గాప్రసాదరావు. ప్రశ్నించే గుణం
ఎక్కువగా ఉన్న నేటితరం పిల్లల్లో చరిత్ర సంస్కృతుల గురించి తెలుసుకోవాలన్న కుతూహలం
కలిగించాలంటే, వాటి అవసరం అర్ధమయ్యేలా చెప్పాలని వివరించారు. భౌతిక సుఖాలకు
అలవాటవుతున్న తరానికి కుటుంబ విలువలు తెలవాలంటే జాతి చరిత్ర, సంస్కృతిపై అవగాహన
కల్పించాలని సోదాహరణంగా వివరించారు.
తెలుగువారి సాహిత్య వైభవం ఘనకీర్తిని
ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి వివరించారు. కవిసార్వభౌముడు శ్రీనాథుడికి కనకాభిషేకంతో
చేసిన సన్మానం ఏ దేశంలోనూ ఏ కవికీ జరగలేదన్నారు. రామాయణ కల్పవృక్ష కర్త
విశ్వనాథ సత్యనారాయణ తన గురువు చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి కీర్తిని వర్ణించిన
తీరులో మరే భాషలో ఏ కవీ తన గురువును కీర్తించలేదని చెప్పారు. ఆ చెళ్ళపిళ్ళ
వెంకటశాస్త్రి తన మరోశిష్యుడైన గుర్రం జాషువా కాలికి గండపెండేరం తొడిగిన ఘట్టాన్ని
వర్ణించారు. సందర్భోచితంగా పద్యాలు పాడుతూ అలరించారు. తెలుగు భాషా వైభవాన్ని
గుర్తించి, నేర్చుకోవడాన్ని భవిష్యత్తరాలకు అలవాటు చేయాలని ఆయన సూచించారు.
శాస్త్రసాంకేతిక రంగాల్లో తెలుగువారికి చారిత్రకంగా
ఘనకీర్తి ఉందని డీఆర్డీఓ మాజీ చైర్మన్, కేంద్ర రక్షణ శాఖ సలహాదారు జి. సతీష్
రెడ్డి వివరించారు. శాతవాహనుల కాలం నాటికే తెలుగు వర్తకులు గ్రీస్, రోమ్ దేశాలతో నౌకావాణిజ్యం
చేసేవారని చెప్పారు. లోహశాస్త్రంలో తెలుగువారికి ప్రవేశముందని వివరించారు. వేయేళ్ళకు
ముందే తెలుగు గడ్డ మీదనుంచి మధ్యప్రాచ్యానికి ఉక్కు కత్తులు సరఫరా అయేవని
చెప్పారు. భారతీయమైన ఆయుర్వేద వైద్యశాస్త్రం ఆధునిక వైద్యులు నయం చేయలేని సమస్యలను
సైతం పరిష్కరిస్తోందని సోదాహరణంగా వివరించారు. మన సంస్కృతిని, మన మూలాలనూ
కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో ప్రతీ ప్రాంతానికీ తనదైన
విశిష్టత ఉందనీ, వాటన్నింటినీ క్రోడీకరించి ఆ చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలని
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డీన్ ఫణితి ప్రకాష్
బాబు సూచించారు. వేళ్ళు బలంగా ఉంటేనే చెట్టు బాగుంటుందనీ, చరిత్ర సరిగ్గా తెలుసుకున్న సమాజమే సుదృఢంగా
నిలబడుతుందనీ ఆయన వ్యాఖ్యానించారు. గణితం, విజ్ఞాన శాస్త్రాల్లో తెలుగువారు ప్రతిభావంతులనీ, ఆ చరిత్రను సవ్యంగా నమోదు
చేస్తే భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందనీ ప్రకాష్ బాబు చెప్పారు.
బౌద్ధధర్మం భారతదేశంలో వ్యాప్తి చెందిన
ప్రదేశాల్లో ఆంధ్రప్రాంతం ప్రముఖమైనదని చరిత్రకారిణి ఈమని రాణిశర్మ అన్నారు. ఆ చరిత్ర
అంతా మరుగున పడిపోయిందని ఆవేదన చెందారు. పాశ్చాత్య ప్రపంచంలో విజ్ఞానం వికసించకముందే భారతదేశం ఎంతో అభివృద్ధి చెందిన సాక్ష్యాలు బౌద్ధ సాహిత్యంలో లెక్కకు
మిక్కిలిగా ఉన్నాయని ఉపపత్తులతో సహా వివరించారు. ప్రజాస్వామ్య, గణతంత్ర భావనలు
గ్రీస్, ఈజిప్ట్ వంటి దేశాల్లో కంటె ముందుగా బౌద్ధుల కాలానికే భారతదేశంలో ప్రబలంగా
ఉన్నాయని సోదాహరణంగా చెప్పారు. నలంద, తక్షశిల వంటి విశ్వవిద్యాలయాల ద్వారా బౌద్ధం విద్యను
భారతదేశంలో అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చిందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సంస్కృతి, వైభవాల
గురించి సమగ్రమైన అధ్యయనం చేసే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసామని సెంటర్
ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టడీస్ అధ్యక్షులు డాక్టర్ కర్రి రామారెడ్డి చెప్పారు. భవిష్యత్
కార్యాచరణకు ఈ సదస్సు ఉత్ప్రేరకమని సీఏపీఎస్ నిర్వాహక సభ్యులు వోలేటి సత్యనారాయణ
వివరించారు.