రాష్ట్రంలో సాధారణ ఎన్నికల నిర్వహణకు మార్చిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. తాజా ఓటర్ల జాబితా ప్రకటించే క్రమంలో భాగంగా కొత్త ఓటర్లను చేర్చుకోవడం, మరణించిన వారి పేర్లు తొలగించడం, ఓ నియోజకవర్గం నుంచి మరోచోటకి బదిలీ చేసే ప్రక్రియను ఎన్నికల సంఘం చేపట్టిందన్నారు.
మార్పులు, చేర్పులపై డిసెంబర్ 9 వరకు అభ్యంతరాలు స్వీకరించి…డిసెంబర్ 26 లోగా అన్నింటిని పరిష్కరించి, తుది ఓటర్ల జాబితాను 2024 జవనరి 5న ప్రకటిస్తామన్నారు.
ఇప్పటి వరకు పదిలక్షల బోగస్ ఓట్లను గుర్తించి తొలిగించామన్నారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు.
తెలంగాణలో ఓటు హక్కు వినియోగించుకున్న వారు, మళ్ళీ ఏపీలో కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉందని పార్టీలు తమ దృష్టికి తెచ్చినట్లు తెలిపారు. అక్కడి నుంచి ఓటు హక్కు బదిలీ చేసుకుంటే అవకాశం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు.
ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, తప్పులు సరిదిద్దుకునేందుకు డిసెంబర్ 9 వరకు అవకాశం ఉందన్నారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రతీ పోలింగ్ బూత్ వద్ద రెండుసార్లు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. నవంబరు 4,5 డిసెంబరు 2,3 తేదీల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఆయా తేదీల్లో అభ్యంతరాలు, తప్పుల సవరణకు దరఖాస్తు చేసుకోవచ్చు అని ప్రకటించారు.
2023 జనవరి 1 నాటికి 18 ఏళ్లు వయస్సు నిండిన వారెవరైనా ఓటరుగా నమోదయ్యేందుకు గతంలో దరఖాస్తు చేసుకోకపోతే డిసెంబరు 9 వరకు సమయం ఉందన్నారు. 2024 ఏప్రిల్ 1, జులై1, అక్టోబరు 1 నాటికి 18 ఏళ్ళు నిండేవారెవరైనా కూడా ముందస్తు దరఖాస్తు చేసుకోవచ్చు అని పేర్కొన్నారు.