చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న నాల్గో పారా ఆసియా క్రీడల్లో (Para Asian Games) భారత్ అథ్లెట్లు అంచనాలకు మించి రాణిస్తున్నారు. అత్యుత్తమ ప్రదర్శనతో పతకాల సాధించి రికార్డు సృష్టించారు. ఈ పోటీల్లో భారత్ క్రీడాకారులు సాధించిన పతకాల సంఖ్య తాజాగా వంద దాటేసింది.
ప్రస్తుతం 111 పతకాలతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఇందులో 29 బంగారు, 31 రజతాలు, 51 కాంస్య పతకాలు ఉన్నాయి. 2018లో జకార్తాలో జరిగిన పోటీల్లో భారత్ 72 పతకాలు సాధించగా అందులో 15 బంగారం, 24 రజతం, 33 కాంస్య పతకాలు ఉన్నాయి.
చివరి రోజైన నేడు తొలి పతకం పురుషుల 400 మీటర్ల విభాగంలో భారత్‌కు దక్కింది. గోల్డ్ మెడల్‌తోనే భారత్ ‘సెంచరీ’ మార్క్‌ను తాకింది. కేవలం 49.48 సెకన్లలోనే రేస్‌ను పూర్తి చేసి గవిత్ బంగారు పతకం సాధించాడు.
పారా ఆసియా గేమ్స్ లో భారత్ వంద పతకాల మార్క్ ను దాటడంపై ప్రధాని నరేంద్ర మోదీ ‘ఎక్స్’ వేదికగా అథ్లెట్లకు శుభాకాంక్షలు తెలిపారు. అద్భుతమైన సామర్థ్యానికి, కష్టానికి దక్కిన ఫలితమిది అని కొనియాడారు. మన అథ్లెట్ల దృఢ సంకల్పంతోనే ఇది సాధ్యమైందని అభినందించారు.
పోటీల్లో చైనా అత్యధిక పతకాలు సాధించి పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. 214 స్వర్ణాలు, 167 వెండి, 140 కంచు పతకాలతో మొత్తం 521 మెడల్స్ సాధించింది. రెండో స్థానంలో ఉన్న ఇరాన్ ఇప్పటి వరకు 131 పతకాలు తన ఖాతాలో వేసుకుంది.