టీడీపీ అధినేత చంద్రబాబు(CHANDRA
BABU)పై తప్పుడు కేసులో అరెస్టు చేసి నేటికి 50 రోజులైందని.. వ్యక్తిగత కక్షతోనే ఆయనను అరెస్టు
చేశారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(NARA
LOKESH) ఆరోపించారు. వ్యవస్థలను మేనేజ్ చేసి ప్రజల మధ్యకు
చంద్రబాబును రానీయకుండా చేస్తున్నారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో జ్యుడిషియల్
రిమాండులో ఉన్న చంద్రబాబుతో భువనేశ్వరి, లోకేశ్ ములాఖత్(MULAKAT) అయ్యారు.
అనంతరం జైలు వెలుపల లోకేశ్ మాట్లాడుతూ 50 రోజులుగా
చంద్రబాబును జైలులో ఉంచి ఏం సాధించారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కొత్త ఆధారం
ఒక్కటైనా ప్రజల ముందు పెట్టారా అని
నిలదీశారు. స్కిల్, ఫైబర్నెట్ ఏ కేసులోనైనా కొత్త ఆధారాలు ఏమైనా చూపారా
అని అడిగారు.
ఆధారాలు ఉంటే బయటపెట్టాలని సవాల్ చేశారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 32 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్న లోకేశ్ ..
రైతులను పట్టించుకునే నాథుడే లేడన్నారు. రైతుల కోసం కాకుండా బస్సు యాత్ర పేరుతో గాలి
యాత్ర చేస్తున్నారని వైసీపీనేతలను దుయ్యబట్టారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ
కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. ‘‘ సైకో జగన్ను వదిలిపెట్టం.. ప్రజల తరఫున
పోరాడుతాం’’ అని లోకేశ్ వ్యాఖ్యానించారు.