గత వంద సంవత్సరాల్లో ఇంతటి కరవు చూడలేదని, సాగునీరు అందక పంటలు ఎండిపోతుంటే సీఎం జగన్మోహన్రెడ్డి మొద్దునిద్ర పోతున్నారని టీడీపీ అగ్రికల్చర్ స్టీరింగ్ కమిటీ అభిప్రాయపడింది.కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 మంది వలస కూలీల మృతికి జగన్ రెడ్డి బాధ్యత వహించాలని టీడీపీ వ్యవసాయ స్టీరింగ్ కమిటీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. కరవు, రైతు సమస్యలపై నవంబర్లో తెలుగుదేశం పార్టీ వ్యవసాయ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి పర్యటనలకు ప్రణాళిక రూపకల్పన చేసినట్లు ఆయన ప్రకటించారు.
తీవ్ర కరవు, దుర్భిక్ష పరిస్థితులపై వ్యవసాయ స్టీరింగ్ కమిటీ ఇవాళ మంగళగిరి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశమైంది. రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఎండిపోతున్న పంటలను కాపాడటంలో జగన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యంపై టీడీపీ నేతలు విస్తృతంగా చర్చించారు.
వర్షాలు లేకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ లో 40 లక్షల ఎకరాల్లో రైతులు పంట వేయలేదని, సాగునీరు అందక వేసిన పంటల్లో మూడొంతులు దెబ్బతిన్నాయని టీడీపీ రైతు విభాగం అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి విమర్శించారు. రాయలసీమలో 18 లక్షల ఎకరాల్లో సాగు కావాల్సిన వేరుశనగ పంట ఈ ఏడాది కేవలం 7 లక్షల ఎకరాల్లోనే సాగైందని కమిటీ తెలిపింది. వర్షాలు లేక ఆ పంట కూడా ఎండిపోయిందని టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా కరవు మండలాలను ప్రకటించాలని కమిటీ డిమాండ్ చేసింది.
కరవు, రైతు సమస్యలపై నవంబరులో టీడీపీ(TDP) వ్యవసాయ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి పర్యటనలకు రూపకల్పన చేశారు. ఈ కమిటీలో మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, ప్రత్తిపాటి పుల్లారావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, కూన రవికుమార్, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బీసీ జనార్థన్ రెడ్డి, గుంటూరు మిర్చియార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు, తెలుగురైతు ప్రధాన కార్యదర్శి సాంబిరెడ్డి సభ్యులుగా ఉన్నారు.