క్యాష్ ఫర్ క్వైరీ కేసులో ఈ నెల 31న పార్లమెంటు ఎథిక్స్ కమిటీ ముందు హాజరు కావడం లేదని తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా (mahua moitra) స్పష్టం చేశారు.డబ్బు తీసుకుని ప్రశ్నలు వేయడం, పార్లమెంటరీ ఐడీ దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై మొయిత్రాకు ఎథిక్స్ కమిటీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. లోక్‌సభలో ప్రశ్నలు వేయడానికి తన పార్లమెంటరీ ఐడీని వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీకి ఇచ్చారనే ఆరోపణలపై మహువా విచారణ ఎదుర్కొంటున్నారు. ఎథిక్స్ కమిటీ ఛైర్మన్ తనకు శుక్రవారం సాయంత్రం గం.7:20 నిమిషాలకు ఇమెయిల్ పంపారని, అంతకు ముందే ఆ లేఖ టీవీల్లో ప్రత్యక్షమైందని, కావాలనే అఫిడవిట్‌ను కూడా మీడియాకు విడుదల చేశారని మహువా ఆరోపిస్తున్నారు.
నవంబరు 4 వరకు తనకు నియోజకవర్గంలో ముందుగా నిర్ణయించుకున్న వివిధ కార్యక్రమాలు ఉన్నాయని అందువల్ల ఈ నెల 31న ఎథిక్స్ కమిటీ ముందు హాజరు కాలేనని మహువా మొయిత్రా తెలిపారు. ఈ కేసులో మహువాపై ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే, సుప్రీంకోర్టు న్యాయవాది జై అనంత్ దేహద్రాయ్‌ల వాంగ్మూలాలను ఎథిక్స్ కమిటీ శుక్రవారం నాడు రికార్డు చేసింది.అదానీ గ్రూపును లక్ష్యంగా చేసుకుని వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి డబ్బుతీసుకుని ప్రశ్నలు వేశారని ఎంపీ మహువా మొయిత్రా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.