కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లిపోయిందని భారత్ మొబైల్ కాంగ్రెస్ (Bharat Mobile Congress) ఏడో ఎడిషన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజలు ఆ ఫోనును 2014లోనే వదిలేశారని ఆయన ఎద్దేవా చేశారు. దేశం గతిని మార్చే ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారని ఆయన అన్నారు. కాలం చెల్లిపోయిన ఫోన్లలో స్తంభించిన స్క్రీన్లపై ఎన్నిసార్లు నొక్కినా ప్రయోజనం ఉండదని ఆయన అన్నారు. అలాంటి ఫోను ఛార్జింగు పెట్టినా ప్రయోజనం లేదన్నారు. 2014లోనే ప్రజలు ఆ ఫోనును వదిలించుకున్నారని ప్రధాని మోదీ (pm modi) విమర్శించారు. 2014 అనేది కేవలం ఒక సంవత్సరం కాదని, పెనుమార్పుకు సంకేతమన్నారు.
బీజేపీ అధికారంలోకి వచ్చాక సాంకేతికంగా భారత్ సాధించిన విజయాలను ప్రధాని మోదీ గుర్తుచేశారు. 5జీ అందుబాటులోకి వచ్చాక పెను మార్పులు వచ్చాయన్నారు. 6జీ దిశగా భారత్ వడివడిగా అడుగులు వేస్తోందన్నారు. 5జీ అందుబాటులోకి వచ్చిన ఏడాదిలోనే 4 లక్షల బేస్ స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయని ప్రధాని వెల్లడించారు. 5జీ అందుబాటులోకి రాక ముందు బ్రాడ్‌బ్యాండ్ సేవల వేగంలో భారత్ 118 స్థానంలో ఉండగా, నేడు 48వ ర్యాంకుకు ఎగబాకిందని ప్రధాని మోదీ గుర్తుచేశారు.
దేశంలో అనేక కంపెనీలు ఫోన్లు తయారు చేస్తున్నాయని, టెక్ విప్లవంలో యువతదే కీలకపాత్ర అని మోదీ అన్నారు. అంతరిక్షరంగంలోనూ భారత్ వేగంగా అభివృద్ధి సాధిస్తోందన్నారు. యూపీఏ హయాంలో ఏం జరిగిందో అందరికీ తెలుసని ఆయన అన్నారు. 6జీ సాంకేతికతలో భారత్ ప్రపంచానికి మార్గనిర్దేశం చేస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.