రేషన్ స్కాం (Ration Scam)తో సంబంధాలున్నాయనే ఆరోపణలపై పశ్చిమ బెంగాల్ మంత్రి జ్యోతిప్రియ మల్లిక్‌ను గురువారం రాత్రి ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. కోల్‌కతాలోని సాల్ట్ లేక్ ప్రాంతంలోని మంత్రి ఇంట్లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కుట్రలో తనను అన్యాయంగా ఇరికించారని అరెస్ట్ సమయంలో మంత్రి జ్యోతిప్రియ మల్లిక్ విలేకరులకు చెప్పారు. నిత్యావసరాల పంపిణీలో మంత్రి అవినీతికి పాల్పడ్డారని ఈడీ ఆరోపిస్తోంది. ప్రస్తుతం మల్లిక్ బెంగాల్ అటవీ శాఖా మంత్రిగా చేస్తున్నారు. గతంలో పౌరసరఫరాల శాఖను నిర్వహించారు. మంత్రి అరెస్ట్‌పై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇంతవరకు స్పందించలేదు.
ఉపాధ్యాయుల నియామకం స్కాంలో కొద్ది నెలల కిందట పశ్చిమ బెంగాల్ విద్యాశాఖ మంత్రి పార్థ ఛటర్జీ, ఆయన సహాయకురాలు అర్పిత ముఖర్జీని ఈడీ అరెస్ట్ చేసింది. వీరిని ఉపాధ్యాయ నియామకాల స్కాంలో ఈడీ విచారిస్తోంది. బీర్బుమ్ జిల్లా టీఎంసీ అధ్యక్షుడు అనుబ్రత మండల్ కూడా దూడల స్మగ్లింగ్ కేసులో అరెస్టయ్యారు. బొగ్గు కుంభకోణంలో సీఎం మమతా బెనర్జీ బంధువులు, టీఎంసీ సీనియర్ నేత అభిషేక్ బెనర్జీని అనేకసార్లు ఈడీ సమన్లు జారీచేసి ప్రశ్నించింది.